Site icon PRASHNA AYUDHAM

డంపుయార్డు నిర్మాణం చేపట్టవద్దంటూ.. గుండ్లమాచునూర్‌ గ్రామస్థుల ఆందోళన

సంగారెడ్డి/హత్నూర, జూలై 23 (ప్రశ్న ఆయుధం న్యూస్‌): పరిశ్రమల కాలుష్యంతో గ్రామంలో ఉండలేకపోతున్నామని, విష వాయువులతో వింత వ్యాధుల బారిన పడుతున్నామని, దానికి తోడు డంపుయారు నిర్మాణం చేస్తే ఊరుకునేది లేదని గుండ్లమాచనూర్‌ గ్రామస్తులు అధికారులపై ఆగ్రహ వ్యక్తం చేశారు. మంగళవారం నాడు సంగారెడ్డి జిల్లా గుండ్లమాచునూర్‌లో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాణాలను అడ్డుపెట్టి అయినా డంపుయార్డును అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కంది మండలం ఆరుట్ల గ్రామ శివారులోని సర్వే నెంబరు 133లో సంగారెడ్డి మున్సిపాలిటీ చెత్త నిల్వ కొరకు గత మూడు రోజులుగా డంపుయార్డు నిర్మాణం పనులు చేపట్టారు. డంపుయార్డు నిర్మాణం చేపట్టతలపెట్టిన భూమి గుండ్లమాచూనూర్‌ గ్రామానికి అతి సమీపంలో ఉండడంతో ఆ గ్రామస్తులు మొదటి నుంచి అక్కడ డంపుయార్డు ఏర్పాటును అడ్డుకుంటూ వస్తున్నారు. మంగళవారం ఉదయం సంగారెడ్డి మున్సిపాలిటీ సిబ్బంది జేసీబీ, ట్రాక్టర్లతో గుండ్లమాచూనూర్‌ మీదుగా డంపుయార్డు వద్దకు వెళ్తుండగా.. గ్రామస్తులు వాటిని అడ్డుకొని తిప్పి పంపారు. అంతలోనే గ్రామానికి వచ్చిన కంది తహసీల్దార్‌ విజయలక్ష్మి, సంగారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ చౌహన్‌ ప్రసాద్‌, డిప్యూటీ ఈఈ ఇంతియాజ్‌లు స్థానికులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించగా.. లెక్క చేయలేదు. మా గ్రామానికి ఆనుకొని ఉన్న రసాయన పరిశ్రమల కాలుష్యంతో నిత్యం అనేక తిప్పలు పడుతున్నాం.. తాగే నీరు.. పీల్చే గాలి కలుషితమై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నామంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిగే నక్కపై తాటికాయ పడ్డట్టు డంపింగ్‌ యార్డు నిర్మాణం చేసి సంగారెడ్డి మురికితో తాము సహజీవనం చేయాలా.. అంటూ అధికారులను నిలదీశారు. డంపుయార్డు పనులు నిలుపుదల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడేది లేదని గ్రామస్తులు అధికారుల ఎదుట స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న హత్నూర తహసీల్దార్‌ ఫర్హీన్‌ షేక్‌ గ్రామానికి చేరుకొని పలు విధాలుగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. స్థానికులు లెక్కచేయకుండా నిరసన వ్యక్తం చేశారు.

Exit mobile version