కో లివింగ్: అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉండే ఈ హాస్టళ్ల వల్ల నేరాలు పెరుగుతున్నాయా, వివాదమేంటి?

కో లివింగ్: అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉండే ఈ హాస్టళ్ల వల్ల నేరాలు పెరుగుతున్నాయా, వివాదమేంటి?హైదరాబాద్‌లో కో లివింగ్ కల్చర్‌పై ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు.

హైటెక్‌ సిటీ పరిధిలోని కో లివింగ్ హాస్టళ్లపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, సమాచార, ఐటీ, సాంకేతిక శాఖ మంత్రి శ్రీధర్‌ బాబుకు సూచించారు.

అయితే వీహెచ్ ఆరోపణలు, అనుమానాలపై ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

అసలు కో లివింగ్ అంటే ఏంటి? హైదరాబాద్‌లో ఈ సంస్కృతి ఎందుకు పెరుగుతోంది?

అమెరికా, కెనడా లాంటి దేశాల్లో కో లివింగ్‌కు, హైదరాబాద్‌, బెంగళూరు, భారత్‌లోని ఇతర నగరాల్లో కో లివింగ్‌కు తేడా భారత్‌లాంటి దేశాల్లో ఒకప్పుడు పరిచయంలేని అమ్మాయిలు, అబ్బాయిలు రోడ్డు మీదో, ఇంకెక్కడైనా బహిరంగ ప్రాంతాల్లోనో కలిసి కనిపించడాన్నే తప్పుగా భావించేవారు.

కో ఎడ్యుకేషన్ కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకున్నా…అమ్మాయిలు, అబ్బాయిల మధ్య స్నేహానికి, కలిసి తిరగడానికి సమాజం ఓ విభజన రేఖను ఏర్పరిచింది. ఆ పరిధిలోనే మనుషుల ఆలోచనా విధానం ఉండేది.

కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. దిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీల్లో జీవన విధానంలో మార్పులొచ్చాయి. ఐటీ రంగం విస్తృతితో గతంలోలా ఆడ, మగ మధ్య పెద్దగా భేదాలుండటం లేదు. ఒకేచోట కలిసి పని చేయాల్సి రావడం, యువతీ యువకుల ఉద్యోగ విధులు ఒకే తరహాలో ఉండడంతో వారి ఆలోచనా విధానంలోనూ మార్పులొచ్చాయి.

ఆఫీసు అవసరాల రీత్యా కలివిడిగా ఉండడం తప్పనిసరైంది. అదే సంస్కృతి జీవన విధానంలోనూ ప్రతిబింబిస్తోంది.

గడచిన రెండు దశాబ్దాలుగా సామాజికపరంగా వచ్చిన మార్పు ఇదైతే, అదే సమయంలో ఓ మోస్తరు పట్టణాల నుంచి భారీ నగరాల దాకా అన్నిచోట్లా భారీ స్థాయిలో పెరిగిన జీవన వ్యయం.. జీవన విధానాలపై పెను ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యం నుంచి ఆవిర్భవించిందే కో లివింగ్ కల్చర్.

రక్తసంబంధం, బంధుత్వం, వివాహ బంధం వంటివేమీ లేని ఓ అమ్మాయి లేదా అబ్బాయి, కొందరమ్మాయిలు లేదా అబ్బాయిలు ఒకే ఇంట్లో కలిసి ఉండడమే కో లివింగ్.

ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కలిసి ఉన్నట్లుగా, ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు కలిసి ఉన్నట్లుగానే, ముగ్గురు నలుగురు అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి ఒకే ఇంట్లో ఉండటం అత్యంత సహజమని, దాన్ని శారీరక సంబంధాల కోణంలో చూడాల్సిన అవసరం లేదని కో లివింగ్ సంస్కృతి గురించి తెలిసిన వాళ్లు అంటున్నారు.

కలిసి ఉన్నంత మాత్రాన వారు శారీరక సంబంధాలు ఏర్పరుచుకుంటారన్న భావన సరికాదని, ఒకవేళ అలా ఏర్పరుచుకున్నా అది వ్యక్తిగత విషయంగా చూడాలని వారు అంటున్నారు.

అయితే, పెళ్లి కాని అమ్మాయి, అబ్బాయి ఒక ఇంట్లో కలిసి ఉండడం తప్పన్న అభిప్రాయం మన సమాజంలో ఉంటుంది. ఈ కోణంలో చూసి, ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని వీహెచ్ కోరారు.

పెళ్లిచేసుకుని విడిపోవడం కన్నా, ఒక చోట కొంతకాలం కలిసి జీవించడం ద్వారా వివాహ బంధంలోకి అడుగుపెట్టాలా లేదా అన్నదానిపై నిర్ణయం తీసుకోవచ్చని భావించేవారు, హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్‌ల వంటి ఖర్చులు భరించలేనివారు కో లివింగ్‌ స్పేసెస్‌కు ప్రాధాన్యమిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ సహా అనేక ప్రాంతాల్లో వర్కింగ్ విమెన్స్ హాస్టళ్లు, బాయ్స్ పీజీలకు చాలా డిమాండ్ ఉంటుంది. ఇలాంటి నివాస సదుపాయాలు అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరుగా ఉంటాయి. వాళ్లు వెచ్చించగలిగే మొత్తాన్ని బట్టి సౌకర్యాలు అందిస్తుంటారు.

యువతీ యువకులు, స్టూడెంట్లు, ఉద్యోగాలు చేసేవారు పీజీల్లో ఉండేందుకు ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. భోజన సదుపాయంతో పాటు పీజీల్లో భద్రత ఉంటుందని భావించడం దీనికి మరో కారణం.

అయితే పీజీల్లో ఉండడం ఇష్టం లేనివారు, మరింత సౌకర్యవంతంగా ఉండాలని భావించే కొందరు… ముగ్గురు, నలుగురు కలిసి సొంతంగా గదులు అద్దెకు తీసుకుని ఉంటుంటారు.

ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా వ్యాప్తి చెందుతున్న సంస్కృతి కో లివింగ్.

వీహెచ్ చెప్పినదాని ప్రకారం పీజీలు కొత్తగా కో లివింగ్ హాస్టల్స్ అవతారమెత్తాయి. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఒకే ఇంట్లో ఉండే అవకాశం ఇవి కల్పిస్తున్నాయి.

వారు ఒకే ఇంట్లో నివసించడానికి వీలుగా అవసరమైన సదుపాయాలను నిర్వాహకులు కల్పిస్తారు. ఇది సరైన విధానం కాదని, నేరాలు పెరిగే ప్రమాదముందని ఆయన హెచ్చరించారుహైదరాబాద్‌లో కో లివింగ్ కల్చర్ ఎక్కడుంది?

సైబరాబాద్ కేంద్రంగా ఈ సంస్కృతి విస్తరించిందని వీహెచ్ చెబుతున్నారు. ఐటీ రంగం ప్రభావం హైటెక్‌సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గడచిన 20ఏళ్లుగా బాగా పెరిగింది. రియల్ ఎస్టేట్ ప్రభావంతో ఇళ్ల స్థలాల ధరలు, ఇళ్ల ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి.

దీంతో హైటెక్ సిటీ చుట్టుపక్కల పీజీల సంఖ్యా బాగా పెరిగింది. అయితే పీజీలు సౌకర్యవంతం కాదని భావించేవారికి, స్థోమత ఉన్నవారికి, ఇంట్లోనే ఉంటున్నామన్న భావన కల్పించడానికి, మరింత మెరుగైన సౌకర్యాలతో కో లివింగ్ హాస్టళ్లు అందుబాటులోకొచ్చాయి. లగ్జరీ హోటళ్లలో దొరికే సౌకర్యాలు, సేవలను ఈ పీజీల్లో కల్పిస్తున్నారు.

“ఆఫీసులో కొంచెం లైక్‌మైండెడ్ అనుకున్న వాళ్లమంతా కలిసి ఒకే ఇల్లులాంటి స్పేస్‌లో ఉండటం బాగుంది. ఖర్చులూ కలిసొస్తాయి. బయట ఎక్కడో హాస్టల్లోనో, రూమ్ తీసుకుని ఒంటరిగానో ఉంటున్నామన్న ఫీలింగ్ కూడా ఉండదు” అని వరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో తన స్నేహితులతో కలిసి ఒక ఫ్లాట్‌లో ఉంటున్న ఓ యువతి చెప్పారు. ఆమె తన పేరు ప్రచురించడానికి ఇష్టపడలేదు.

పెద్దగా ఖర్చుపెట్టే ఆర్థిక స్థోమత లేనివారికీ ఇది సదుపాయంగా ఉంది. కొందరు భోజన సదుపాయం కల్పిస్తుంటే మరికొందరు కామన్ కిచెన్, కామన్ లివింగ్ రూమ్, సెపరేట్ బెడ్‌రూంలో ఆడా, మగా ఒకే చోట నివసించే సదుపాయం కల్పిస్తున్నారు.

అయితే ఒకే రూంలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి నివసించే ఏర్పాట్లు కల్పించడం నైతిక విలువలకు వ్యతిరేకం అని వీహెచ్ ఆరోపిస్తున్నారు. ఒకే గదిలో అమ్మాయి-అబ్బాయి కలిసి ఉండేందుకు అనుమతివ్వడం ఎక్కడ న్యాయమని ఆయన ప్రశ్నించారు.హైదరాబాద్‌పై అభ్యంతరాలేంటి?

కో లివింగ్ స్పేసెస్ సంస్కృతి వల్ల నేరాలు పెరిగిపోతాయని, హైదరాబాద్‌కు ఇది చెడ్డపేరు తెస్తుందని వీహెచ్ అంటున్నారు.

కో లివింగ్ స్పేసెస్ నిర్వహించడం నేరం కాదని, 18 ఏళ్లు పైబడిన యువతీ యువకులు ఇష్టపూర్వకంగా కలిసి ఉండొచ్చన్న సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే ఇది ఉందని హైదరాబాద్‌లో ఈ తరహా హాస్టల్ నిర్వహిస్తున్న వెంకటరెడ్డి అనే వ్యక్తి చెబుతున్నారు.

“కో లివింగ్ స్పేస్‌లో ఉండడానికి వచ్చిన యువతీ యువకుల దగ్గరి నుంచి ఆధార్, పాన్ కార్డులు, ఆఫీసు అడ్రస్, తల్లిదండ్రుల కాంటాక్ట్ తీసుకుంటాం. మా దగ్గర నివసించడానికి వచ్చే అమ్మాయిలు, అబ్బాయిల తల్లిదండ్రులకు కో లివింగ్ గురించి తెలుసో లేదో మాకు తెలియదు” అని ఆయనన్నారు.

తాము నివాస, భోజన సదుపాయం కల్పిస్తామని చెప్పారు.

పెళ్లి కానివారే కాకుండా, నివసించడానికి సరైన ఇల్లు దొరకని పెళ్లయినవారు సైతం కో లివింగ్ స్పేస్‌లో ఉంటుంటారని ఆయన తెలిపారు.

పెళ్లితో సంబంధం లేకుండా అమ్మాయిలు, అబ్బాయిలు ఒక చోట ఉండడంలో ఎలాంటి తప్పూలేదని సంధ్య (పేరు మార్చాం) అనే యువతి చెప్పారు.

“శారీరక సంబంధం సంగతి పక్కనపెడితే… చిన్నప్పటి నుంచి అమ్మాయిలను, అబ్బాయిలను వేరుగా ఉంచే సంస్కృతి వల్ల వారిద్దరికీ ఒకరినొకరు గౌరవించుకోవడం కూడా తెలియని పరిస్థితి ఉంటోంది. ఇది సమాజానికి మంచిది కాదు. ఒక చోట కలిసి ఉండడం, శారీరక సంబంధంలోకి వెళ్లాలనుకోవడం, దాన్నుంచి బయటకు రావాలనుకోవడం పూర్తిగా వారి వ్యక్తిగత విషయం” అని ఆమె అన్నారు.ఒకే చోట ఉండాల్సిన అవసరమేంటి?’

అసలు ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి ఒక గదిలో ఉండాల్సిన అవసరమేంటని బీజేపీ ప్రతినిధి పోరెడ్డి కిశోర్ ప్రశ్నించారు. 18ఏళ్లు దాటిన యువతీ యువకులకు కలిసి ఉండే స్వేచ్ఛ ఉన్నప్పటికీ, మనం సమాజంలో భాగమని, మనిషి జీవించడానికి కొన్ని సామాజిక నిబంధనలు, కట్టుబాట్లు ఉన్నాయన్న సంగతిని అందరూ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.

“కో లివింగ్ స్పేస్‌లో కలిసి జీవించాలని ఓ అమ్మాయి, అబ్బాయి నిర్ణయించుకునేముందు సామాజిక పరంగా భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. భావోద్వేగాలు, సంస్కృతీ సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉన్న సమాజంలో మనిషి భాగమని గుర్తుంచుకోవాలి. ఎవరో చెప్పారనో, స్వేచ్ఛ లభించిందనో, అందరూ చేస్తున్నారనో… యువతీ యువకులుగా ఉన్నప్పుడు అనాలోచితంగానో, ఆవేశంలోనో తీసుకునే నిర్ణయాలకు జీవితాంతం మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు ఉంటాయి” అని ఆయన హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment