Site icon PRASHNA AYUDHAM

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్న డిమాండ్..

IMG 20250824 184148

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్న డిమాండ్..

ప్రభుత్వ విశ్వసనీయత నిలుపుకోవాలని వక్తల హెచ్చరిక..

31 ప్రధాన సమస్యలపై యుయస్పిసి మహాధర్నా..

కోదండరామ్, నాగేశ్వర్, నర్సిరెడ్డి, విమలక్కల మద్దతు..

“ఇది ఆరంభం మాత్రమే… ఐక్య పోరాటం.. ఉధృతమవుతుంది” – సంఘ నాయకులు..

ప్రశ్న ఆయుధం ఆగష్టు 24

హైదరాబాద్ ధర్నా చౌక్‌లో శనివారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పిసి) ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించి రాష్ట్ర ప్రభుత్వం విశ్వసనీయతను నిలుపుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు.గత ప్రభుత్వంలో నియంతృత్వ ధోరణి, కేసులు, వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ, ప్రస్తుత ప్రజా ప్రభుత్వంపై విశ్వాసంతో ఉపాధ్యాయులు 20 నెలలుగా ఓపికగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చేసిన హామీలు అమలు కాలేదని, సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం కొనసాగుతోందని విమర్శలు గుప్పించారు.ఉపాధ్యాయులు స్పష్టంగా 31 ప్రధాన సమస్యలను లేవనెత్తారు. ఖాళీ పోస్టుల భర్తీ, సర్దుబాటు ఉత్తర్వుల రద్దు, పిఆర్సీ అమలు, సిపిఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల విడుదల, జిఒ 317 బాధితులకు న్యాయం, 5571 హెడ్‌మాస్టర్ పోస్టుల మంజూరు, పండిట్-పిఇటి పదోన్నతులు, డిప్యూటేషన్ల రద్దు, గురుకుల టైం టేబుల్ సవరణ, కెజిబివి-యుఆర్ఎస్ ఉద్యోగుల వేతన భద్రత, మోడల్ స్కూల్స్ టీచర్లకు కారుణ్య నియామకాలు, ఎయిడెడ్ పాఠశాలల స్వాధీనం, ప్రత్యేక టీచర్లకు ఇంక్రిమెంట్లు, 2008 డియస్సీ టీచర్ల వేతనాలు చెల్లింపు వంటి అంశాలు ప్రధాన డిమాండ్లుగా ఉంచారు.అనేక సార్లు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసినా ఫలితం లేకపోవడంతో ఉద్యమ కార్యాచరణ తప్పనిసరి అయిందని యుయస్పిసి నాయకులు స్పష్టం చేశారు. ఇది కేవలం ఆరంభమేనని, భవిష్యత్తులో మరింత ఉధృతమైన ఐక్య పోరాటం తప్పదని హెచ్చరించారు.స్టీరింగ్ కమిటీకి చెందిన చావ రవి, అనిల్ కుమార్, సోమయ్య తదితరులు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. సుమారు ఐదువేల మంది ఉపాధ్యాయులు ధర్నాలో పాల్గొన్నారు. టిజిఈజెఎసి చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రొ నాగేశ్వర్, నర్సిరెడ్డి, ప్రొ లక్ష్మీనారాయణ, విమలక్క, ఇతర ఉపాధ్యాయ సంఘ నాయకులు సంఘీభావం తెలిపారు.

Exit mobile version