దిల్లీ: విపక్ష ‘ఇండియా కూటమి’లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి అదానీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీని వల్ల వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ విషయంపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగాలని, ఇదే విపక్షాల లక్ష్యమని పేర్కొన్నారు. డిసెంబరు 13న కచ్చితంగా పార్లమెంట్‌లో రాజ్యాంగంపై చర్చ జరగాలని అన్నారు.
కాగా, సభా కార్యకలాపాలు ఎలా సాగాలో భాజపా, కాంగ్రెస్‌లే నిర్ణయిస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ సభలోని ప్రతి విషయంలో భాజపా, కాంగ్రెస్ మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నాయని.. ఈ వైఖరిపై ఇతర పార్టీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. మరోవైపు, రాహుల్ నేడు పార్లమెంట్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. సభలో తనపై భాజపా నేతలు చేసిన అవమానకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ ఎంపీ మీడియాకు చెప్పారు.
లోక్‌సభలో అదానీ అంశంపై తక్షణమే చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ విషయంపై పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విపక్ష నేతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే, ఇందులో టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ నేతలు పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఈ రెండు పార్టీల ఎంపీలు సభా కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన విపక్ష కూటమి భేటీకి కూడా టీఎంసీ దూరంగా ఉంది. పార్లమెంట్ సజావుగా సాగాలని తాము కోరుకుంటున్నామని తృణమూల్ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్ష కూటమికి సారథ్యం వహించే బాధ్యతను మమతా బెనర్జీకి అప్పగించాలని కాంగ్రెస్‌పై మిత్రపక్షాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానన్న దీదీ.. దాన్ని సరిగ్గా నడపాల్సిన బాధ్యత సారథి స్థానంలో ఉన్నవారిపై ఉంటుందన్నారు. దీదీకి ఈ బాధ్యతలు అప్పగించడంపై కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. సమాజ్‌వాదీ, శివసేన (ఉద్ధవ్) నేతలు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో కూటమిలో గందరగోళ వాతావరణం నెలకొంది.