లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో “దిల్ సే” కార్యక్రమం ఘనంగా
కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఆరోగ్య శిబిరం, అవగాహన సదస్సు
7 హిల్స్ హాస్పిటల్ వైద్యులచే హెల్త్ చెకప్ నిర్వహణ
రక్తహీనత, థైరాయిడ్, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై మార్గదర్శనం
విద్యార్థినులకు బిస్కెట్ ప్యాకెట్ల పంపిణీ, వైద్యులకు సత్కారం
బాన్సువాడ ఆర్సి ప్రశ్న ఆయుధం అక్టోబర్ 15
భిర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం “దిల్ సే” సేవా కార్యక్రమం భాగంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ వసతి గృహంలో ఆరోగ్య శిబిరం మరియు అవగాహన సదస్సు జరిగింది.ఈ సందర్భంగా 7 హిల్స్ హాస్పిటల్, బాన్సువాడ వైద్యులు డా. వాగ్దేవి (MD), డా. దివ్యా భవాని (MS OBG) పాల్గొని, విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. రక్తహీనత, థైరాయిడ్, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి, డిప్రెషన్, మహిళల శుభ్రత, వ్యాయామం, ఆరోగ్యకర ఆహారం వంటి అంశాలపై విలువైన సూచనలు చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ రీజియన్ చైర్మన్ పావులూరి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సితలే రమేష్, ట్రెజరర్ మేకల గాలయ్య, జోన్ చైర్మన్ కొట్టురి సంతోష్, సభ్యులు మేకల విఠల్, M.A. రషీద్, పెండ్యాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్లు మరియు విద్యాలయ ప్రిన్సిపాల్ గీత మేడంకు లయన్స్ క్లబ్ తరఫున సత్కారం చేశారు. అనంతరం హాస్టల్‌లో ఉన్న సుమారు 400 మంది విద్యార్థినులకు బిస్కెట్ ప్యాకెట్ల పంపిణీ చేశారు.ప్రజాసేవతో పాటు ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించే ఈ కార్యక్రమం స్థానికంగా మంచి స్పందనను రాబట్టింది.