విద్యార్థుల భద్రతే లక్ష్యం.. అక్రమ వాహనాలపై కొరడా: జిల్లా కలెక్టర్
కామారెడ్డి జిల్లాలో ఆటోలు, మినీ క్యాబ్‌లపై విస్తృత స్థాయిలో తనిఖీలు
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ డిసెంబరు 30:
జిల్లాలో ఆటో రిక్షాలు, మినీ క్యాబ్‌లు తదితర వాహనాల ద్వారా ప్రయాణించే విద్యార్థుల భద్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా రవాణా అధికారి ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో భాగంగా కామారెడ్డి జిల్లాలోని బాన్సవాడ, పిట్లం, తాడ్వాయి, కామారెడ్డి ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆటో రిక్షాలు, మినీ క్యాబ్‌లను గుర్తించి,నిబంధనలు పాటించని వాహనాలను సహాయక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సీజ్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి మాట్లాడుతూ, విద్యార్థుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపే సమయంలో వారు సురక్షితమైన, అనుమతులు ఉన్న వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారా అనే విషయాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ రవాణా శాఖకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.