రేపటి నుంచి ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం: జిల్లా కలెక్టర్..

IMG 20240819 WA0063

రేపటి నుంచి ఓటర్ జాబితా నవీకరణ ( సవరణ) ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఓటర్ జాబితా నవీకరణ పై తాసిల్దార్లు, ఉప తాసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బూతు స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వేను పకడ్బందీగా చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 లో భాగంగా ఓటర్ జాబితా తయారు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడున్న జాబితాలో పేర్లు ఉన్నవారు శాశ్వతంగా ఎక్కడికైనా వెళ్లిపోయారా, చనిపోయారా, పేర్లలో తప్పులు ఉన్నాయా అనే అంశాలను బిఎల్వో లు తెలుసుకునే విధంగా చూడాలన్నారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్ల నిండి ఓటర్ జాబితాలో పేరు లేకుంటే వారి నుంచి దరఖాస్తు స్వీకరించాలని చెప్పారు. ఈ ప్రక్రియలో తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఓటర్ జాబితా ముసాయిదా ను అక్టోబర్ 29న ప్రకటించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 10 వరకు ఇంటింటా సర్వే పనులు పూర్తిచేసే విధంగా అధికారులు చూడాలన్నారు. పోలింగ్ కేంద్రం పరిధిలో 1500 మంది ఓటర్ల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉంటే మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. ఒక కుటుంబం మొత్తం సభ్యులు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చూడాలని కోరారు. సర్వే చేసిన ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించాలని సూచించారు. మృతి చెందిన వారి పేర్లు తొలగించడానికి కుటుంబ సభ్యులకు నోటీస్ అందజేయాలని తెలిపారు. మృతి చెందిన వారి డెత్ సర్టిఫికెట్ నకలు తీసుకొని పేరును తొలగించాలని చెప్పారు. కొత్త ఓటర్ నమోదుకు ఆధార్ నెంబర్, పదో తరగతి మార్కుల జాబితా ఆధారంగా 18 ఏళ్ల నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఓటు హక్కు లేని వారు ఫారం- 6 లో బిఎల్ఓకు అందజేసి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రేపు మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో తాసిల్దార్లు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. వారి అభిప్రాయాలు తీసుకొని, అందరి జాబితా తయారీకి అందరి సహకారం ఉండేలా చూడాలన్నారు. విఐపి ఓటర్లు జాబితా నుంచి తప్పిపోకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మాజీ ప్రజా ప్రతినిధుల పేర్లు ఓటర్ జాబితాలలో ఉండే విధంగా చూడాలని చెప్పారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డిఓ ప్రభాకర్, ఎన్నికల విభాగం అధికారులు, వివిధ మండలాల తహసిల్దార్లు, ఉప తాసిల్దార్లు పాల్గొన్నారు…

Join WhatsApp

Join Now