*కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు: ఈటల రాజేందర్*
: పార్లమెంటు ఎన్నికల్లో మూడో సారి నరేంద్ర మోదీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని, ప్రతిపక్షాల తీరు పార్లమెంటులో విచిత్రంగా ఉందని ప్రజానీకం అంతా ఒకటే భావనతో అన్నారని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా, గజ్వేల్ పట్టణంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశం సుభిక్షంగా ఉండాలన్నా, ఆర్థికంగా, బలంగా ఉండాలన్నా, ప్రపంచంలో దేశం సగౌరవంగా ఉండాలంటే మోదీ ప్రధానిగా ఉండాలనేది ప్రజలకు తెలుసునని అన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 44 శాతం వస్తే.. బీజేపీకి 30 శాతం ఓట్లు వచ్చాయన్నారు.
ఇప్పుడు తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు మోదీని ఆశీర్వదించే విధంగా కనిపిస్తోందని ఈటల రాజేందర్ అన్నారు. ఉపాధ్యాయులకు అండగా కొట్లాడిన పార్టీ బీజేపీ అని, టీచర్ల విషయంలో, మధ్యతరగతి వారి విషయంలో బీజేపీ కృషిచేసిందని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య దేశంలో నే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తాండవిస్తోందని, ప్రపంచం లో 11 వ ఆర్థిక వ్యవస్థలో ఉన్న భారత్ మోదీ కృషితో 5 వ స్థానానికి వచ్చిందన్నారు. నిరుద్యోగ సమస్యను సంపూర్ణంగా నిర్మూలించే విధంగా బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 4 లక్షల కోట్లు పెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పరంగా నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచాన్నే శాసించే అమెరికా అధ్యక్షుడు, అమెరికాలో మోదీని సన్మానించిన విషయం చూసామన్నారు. కేసీఆర్ పాలనను ప్రజలు అసాహ్యించుకోడానికి 9 సంవత్సరాలు పడితే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు అసాహ్యించుకోడానికి 9 నెలలు పట్టిందన్నారు.
కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు.
కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారని, కాంగ్రెస్ పార్టీని కానీ కేసీఆర్‌ను కానీ ప్రజలు నమ్మే విధంగా లేరని ఈటల రాజేందర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే బీఆర్‌ఎస్ అభివృద్ధి చేసిందని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందే కేసీఆర్ అని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ నిలదీయడం ఎంటన్నారు. కాళేశ్వరంపై అధికారులను ప్రశ్నిస్తే కేసీఆర్ చెప్పినట్లే చేసామని చెబుతున్నారు. కేంద్రంలో 70 మందికి పైగా మంత్రులు ఉంటే.. అందులో 30 మందికి పైగా బీసీలే ఉన్నారని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు..