జిల్లా కలెక్టరేట్లో పోషక మాసం ముగింపు కార్యక్రమం ఘనంగా
గర్భిణీలకు, బాలింతలకు మంచి పోషక ఆహారం అందించాలి
: జిల్లాకలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి, అక్టోబర్ 16 :
మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గురువారం ఐడిఓసి సమావేశ మందిరంలో పోషక మాసం ముగింపు కార్యక్రమం జరిగింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం తుది వేడుకకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనం రోజూ తీసుకునే ఆహారంలో చక్కెర, ఉప్పు, నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. అంగన్వాడీలలో జరిగే సామాజిక వేడుకలను మరింత బలోపేతం చేయడం ద్వారా కమ్యూనిటీలో అవగాహన పెంపొందించవచ్చని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు సరైన పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలన్నారు.
జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం నియమితంగా అందించి గర్భిణీ స్త్రీలు, బాలింతల్లో ఎనీమియా తగ్గించడమే లక్ష్యమని తెలిపారు.
కార్యక్రమంలో కలెక్టర్ చేతుల మీదుగా గర్భిణీలకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నపాసన నిర్వహించారు. ఆరోగ్యలక్ష్మిలో రెగ్యులర్ అటెండెన్స్ ఉన్న గర్భిణీలకు, ఆరోగ్యంగా పుట్టిన శిశువులకు బహుమతులు అందజేశారు. చిల్డ్రన్ హోమ్ చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
కార్యక్రమం ముగింపులో అంగన్వాడీ టీచర్ల చేత ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శనను కలెక్టర్ వీక్షించి చిరుధాన్యాలతో చేసిన ఆహారాలను రుచి చూశారు.
ఈ కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ప్రోగ్రామ్ ఆఫీసర్ యమిమ, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, సీడీపీఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.