కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకొని యావత్ సమాజం ముందుకు నడవాలి ….

కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకొని యావత్ సమాజం ముందుకు నడవాలి ….

ప్రముఖ వ్యాపారి, సామాజికవేత్త -ఎం శ్రీనివాస్ కుమార్

ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 27, కామారెడ్డి :

కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి రాజకీయ నాయకులకు ఆదర్శవాది. ప్రముఖ దేశభక్తులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు అని శ్రీనివాస్ కుమార్ అభివర్ణించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ తన 97 సంవత్సరాల జీవితకాలంలో శాసన సభ్యుని గా, మంత్రిగా ఎన్నికైనప్పటికీ ప్రజాసేవకు నిరంతరం పాటుపడుతూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన నిజమైన నాయకుడని, ప్రజా సేవకుడని, అతని జీవిత చరిత్ర నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు.

1977లో శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత అప్పుడున్న పరిస్థితులలో ముఖ్యమంత్రి కావడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావడం ద్వారా తెలంగాణ ప్రాంతానికి ద్రోహం తలపెట్టలేననీ ముఖ్యమంత్రి అవకాశాన్ని తృణ ప్రాయంగా వదిలి పెట్టినటువంటి త్యాగశీలి . ముఖ్యంగా అట్టడుగు వర్గాలు ఆదివాసీలు, దళితులు, బీసీ వర్గాలకు విద్య ద్వారానే సామాజిక ఎదుగుదల సాధ్యమని నమ్మిన కొండా లక్ష్మణ్ బాపూజీ అన్ని వర్గాలకు హాస్టల్ సౌకర్యాలను కల్పించే బృహత్ ప్రణాళిక లో భాగమై ఉన్నత స్థాయి విద్య కూడా ఉచితంగా కల్పించడానికి కృషి చేశారు. ఎంతోమంది విద్యావంతులకు ఆదర్శప్రాయంగా నిలిచాడు. పద్మశాలి కులంలో జన్మించిన
అన్ని కులాలను కలుపుకొని వెళ్ళాడు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ,రాజకీయ రంగాలను ప్రభావితం చేసి అనేక సార్లు గెలిచి నేటికీ ఆదర్శప్రాయుడయ్యాడు. ప్రజల కోసం పని చేసి ప్రజల కోసమే పదవులను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా 96 ఏళ్ల వయసులో ఢిల్లీలో దీక్షలు నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారు. తన పోరాట ప్రతిమను మనం గుర్తుంచుకోవాలి. అంత వయసులో కూడా ఎందుకోసం ఆరాటపడినాడని నేటి యువత, సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకోకపోతే ఆయన జీవితము నుండి మనము ఏమి నేర్చుకోనట్లే లెక్క.
తెలంగాణ స్వాతంత్ర పోరాటంతో పాటు , అహింసా మార్గంలో స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళలో కొండా లక్ష్మణ్ బాపూజీ అగ్రగణ్యుడు అని చెప్పడంలో సందేహం లేదు. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర పోరాటంలో శాంతియుతంగా అహింసా పద్ధతిలో పోరాటం చేయగా, తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉద్యమ పోరాటంలో పాల్గొన్న యోధులలో పేరెన్నికగన్న వాడు. నిజాం నిరంకుశ పరిపాలనను, రజాకార్ల దౌష్ట్యాన్ని వ్యతిరేకించే క్రమంలో అనేక సార్లు జైలు పాలై శిక్ష అనుభవించిన కొండా లక్ష్మణ్ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి అనేక మంది పైన మోపిన కేసులను పరిష్కరించడంలో కూడా న్యాయవాదిగా ఆయన చేసిన సేవ చిరస్మరణీయమైనది. చాకలి ఐలమ్మ , కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రమహాసభ కార్యకర్తలపై నాటి ప్రభుత్వం మోపిన కేసులను ఉచితంగా వాదించి తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమానికి తోడ్పాటు అందించారు కొండాలక్ష్మణ్ బాపూజీ. నేటి యువతరం లాయర్లు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, విద్యారంగ నిపుణులు బాపూజీని ఆదర్శంగా తీసుకోవాలి. అనేకమైనటువంటి సామాజిక అంశాలతో పాటు ప్రజా ప్రతినిధిగా సేవలందించారు. ఇక తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి మంత్రి పదవిని, ముఖ్యమంత్రి పదవిని ఒకసారి త్యాగం చేసిన చరిత్ర కొండా లక్ష్మణ్ బాపూజీది.1967లో మంత్రిగా నియామకమైన తర్వాత 1969లో వచ్చిన ఉద్యమకాలంలో తాను తెలంగాణ ఉద్యమకారులకు మద్దతుగా నిక్కచ్చిగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నందుకు నాటి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం జైలు శిక్ష విధించినది.
1996 లో ప్రారంభమైన మలిదశ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొని అన్ని ఉద్యమాలకు మద్దతునిస్తూ 2011 లో 96 సంవత్సరాల వయస్సులో ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టిన సంఘటన ఎప్పటికీ మర్చిపోలేము. రాజకీయ సామాజిక ప్రజా సేవ చేయడం నేటి తరానికి ఆదర్శనీయం. నేటి రాజకీయ పార్టీలు అతన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి.

తెలంగాణ సాయుధ పోరాట కాలంలో 1947 తర్వాత దేశ వ్యాప్తంగా త్రివర్ణ పతాకం ఎగిరితే హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాలలో మాత్రం మువ్వన్నెల జెండా ఎగరడానికి వీలులేకుండా నిజాం ఆంక్షలు విధించిన నేపథ్యంలో హైదరాబాదు, ఇతర ప్రాంతాలలో సాహసోపేతంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తన సత్తాను చాటినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ.
రాజకీయాలలో పని చేయడం కాదు సామాజిక ఉద్యమాల్లో తెలంగాణ సాధనలో తన వంతు బాధ్యతగా లక్ష్మణ్ బాపూజీ నిలిచారని శ్రీనివాస్ కుమార్ తెలిపారు. జనం కోసం, ప్రజల అందరి కోసం, అన్ని వర్గాల కోసం, చివరికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని రాజీనామా చేయడమే కాకుండా వచ్చిన ముఖ్యమంత్రి అవకాశాన్ని కూడా వదిలిపెట్టిన గొప్ప త్యాగశీలిని తెలిపారు. బాపూజీ ఉద్యమ నేపథ్యాన్ని జీవన మార్గాన్ని నేటితరం యువత, రాజకీయ నాయకులు, పార్టీలు ఆదర్శంగా స్వీకరించాలి. విలువలు లేని రాజకీయాలను, దిగజారుడు తనాన్ని అవినీతి సమాజం నుంచి తీసేయాలి. రాజకీయ అవినీతిని నిర్మూలించ కుండా ఉద్యోగ స్వామ్యం లో అవినీతిని నిర్మూలించడం సాధ్యం కాదని పలువురు అభిప్రాయం వ్యక్తపరిచారు.
రాజకీయాలంటే పదవులు, గుర్తింపు, సభలు, సమావేశాలు, హోదాలని కొండా లక్ష్మణ్ బాపూజీ ఏనాడు కూడా అనుకోలేదు. నైతిక విలువలకు కట్టుబడి జీవించినట్లు తన చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. నేటి పౌరులు, యువకులు, మేధావులు అతని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని శ్రీనివాస్ కుమార్ అభిప్రాయపడ్డారు. నేటి రాజకీయ నాయకుల్లో అవినీతి అక్రమాలు పెచ్చు మీరి పోయాయని అలాంటివారికి బాపూజీ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. నిజాయితీగా, నిక్స్పక్షపాతంగా వ్యవహరించిన వ్యక్తులు మాత్రమే బాపూజీని గురించి మాట్లాడాలని పిలుపునిచ్చారు. నేటి యువత పెడదారి పడుతుందని, ఆకర్షణకు లోనవుతుందని రాజకీయ నాయకులు అవినీతికి, అక్రమాలకు ,అన్యాయాలకు పాల్పడుతూ చట్టాలను అధికారులను తన ఆధిపత్యంలో ఉంచుకొని వ్యవహరిస్తున్నారని అలాంటి వాళ్ళు నిస్వార్ధంగా జీవిత కాలం ప్రజాసేవ కొరకు పోరాడినటువంటి వ్యక్తి గురించి మాట్లాడే నైతిక అర్హత హక్కులు లేవని తెలిపారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని రాజకీయ పార్టీలు మాత్రమే అతని జయంతిని ఉత్సవాలను అతని గురించి మాట్లాడే అర్హత ఆయా రాజకీయ పార్టీలకు ఉంటుందని కూడా అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ తో యుద్ధం జరిగిన సమయంలో తన కొడుకు యుద్ధ పైలట్ గా విధులు నిర్వహించగా, తన భార్య వైద్యురాలిగా క్షతగాత్రులకు వైద్య సేవలు అందించిన ఘనత ఆ కుటుంబనిదని ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త ఎం శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే మూడు ఉద్యమాల్లో పాల్గొన్న చరిత్ర ఆయనది. స్వతంత్ర పోరాటంలోనూ, హైదరాబాద్ సంస్థానం భారతదేశ విలీనంలోనూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటలోనూ మూడు ఉద్యమాల్లోనూ పాల్గొన్న చరిత్ర ఆ మహనీయునిదని ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త శ్రీనివాస్ కుమార్ కొనియాడారు.

Join WhatsApp

Join Now