విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి సహకారం: కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కృష్ణ ఆయుధం సెప్టెంబర్ 03
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పడుతుందని హామీ ఇచ్చారు. విద్యార్థులకు అవసరమైన ఆట వస్తువులు, పుస్తకాలు, మౌలిక సదుపాయాలు అందిస్తామని ఆయన తెలిపారు. బుధవారం కీసర మండలంలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజ్ (బాలురు)ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తాగునీరు, లైబ్రరీ పుస్తకాలు, క్రీడా సామగ్రి, పరీక్షా బిట్స్ అవసరమని చెప్పగా, వాటిని వెంటనే సమకూరుస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. పాత భవనంలో వర్షపు నీరు కారుతున్న విషయాన్ని, గోడల బలం లేకపోవడాన్ని పరిశీలించారు. అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని ప్రిన్సిపల్‌కు సూచించారు.
కిచెన్‌లో కోతుల బెడద ఎక్కువగా ఉందని ప్రిన్సిపల్ తెలపగా, గ్రిల్స్, డోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ రైఫిల్ షూటింగ్ రూమ్, కిచెన్ స్టోర్ గదులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకొని, స్వయంగా భోజనాన్ని రుచి చూశారు.
ఈ కార్యక్రమంలో డీఈఓ విజయకుమారి, కీసర ఎమ్మార్వో అశోక్, ప్రిన్సిపల్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.