జీవధాన్ పాఠశాలలో జరిగిన ఘటన చాలా బాధాకరం
–ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
ప్రశ్న ఆయుదం న్యూస్, సెప్టెంబర్ 30, కామారెడ్డి :
కామారెడ్డి ఆర్ అండ్ బి అతిథి గృహంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కామారెడ్డి పట్టణంలోని జీవధాన్ పాఠశాలలో జరిగిన ఘటన చాలా బాధాకరమని అన్నారు.
జీవధాన్ పాఠశాలలో ఆరేళ్ళ చిన్నారి పై లైంగిక దాడి కేసు విషయం లోతైన విచారణ చేపట్టి దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మీడియా ద్వారా తనకు విషయం తెలిసి బాధపడ్డానన్నారు. ఈ విషయమై జిల్లా ఇంఛార్జి మంత్రి కూడా ఆరా తీశారని తెలిపారు. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో అమ్మాయి చనిపోయిందని దుష్ప్రచారం చేశారని, దీంతో పాఠశాలలో జరిగిన ఆందోళనలో కొందరు అల్లరి మూకలు పోలీసుల పై రాళ్లదాడికి పాల్పడ్డారని, ఈ దాడిలో సీఐ చంద్రశేఖర్ రెడ్డి తలకు గాయం కాగా, ఎస్సై రాజారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, హెడ్ కానిస్టేబుల్ హజారుద్దీన్ కు కాలు విరిగిందన్నారు.
ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై, సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ, ఐజీలను కోరానన్నారు.
అమాయక యువకులపై, విద్యార్థుల కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయొద్దని, అలా చేస్తే భవిష్యత్తులో వారికి ఉద్యోగాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు.
పాఠశాలలో ఆందోళన నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం సూచన మేరకు పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారన్నారు. కామారెడ్డి శాంతియుతంగా ఉందని, ఇది కమ్యూనల్ ఇష్యు కాదన్నారు. ఇలాంటి వార్తల సేకరణలో మీడియా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఘటనకు సంబంధించి కొన్ని ఛానళ్లలో అత్యాచారం జరిగిందని, మరికొన్ని ఛానళ్లలో అత్యాచారయత్నం అని, కొన్ని చానల్లో లైంగికదాడి అని వివిధ రకాలుగా వచ్చిందని
ప్రజలు దేనిని నమ్మాలన్నారు. వార్తల సేకరణలో తొందరపాటు జరగకుండా చూడాలని కోరారు. కొద్దిపాటి ఆలస్యమైన వాస్తవాలు మాత్రమే సేకరించి ప్రచురించాలి అన్నారు. కామారెడ్డి భవిష్యత్తుకు కుల, మతాలకు అతీతంగా అందరూ సహకరించాల న్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.