ఎన్టీఆర్ జిల్లా లో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

*ఎన్టీఆర్ జిల్లా లో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం*

రాజధాని అమరావతిలో సకల వసతులు సమకూర్చాలని ప్రయత్నిస్తున్న సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవ నగరాలు కాన్సెప్ట్ తో రాజధాని నగరంలో స్పోర్ట్స్ సిటీకి రూపకల్పన చేశారు.

అయితే అమరావతి అంతర్బాగంగా ఉన్న ఈ స్పోర్ట్స్ సిటీలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలని భావించారు. అయితే స్పోర్ట్స్ సిటీలో తగినంత భూమి అందుబాటులో లేనందున అమరావతికి ఆనుకుని క్రిష్ణా నది తీరంలో భారీ అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. దేశంలోనే అతిపెద్దదైన స్టేడియం కోసం ఇప్పటికే భూమిని ఎంపిక చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో ఉంది. దీనికన్నా పెద్ద స్టేడియం ఏపీలో నిర్మించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం ను తలదన్నేలా రాజధాని అమరావతికి సమీపంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని పెదలంక, చినలంక గ్రామాల పరిధిలో స్టేడియం నిర్మాణానికి భూములు పరిశీలించారు.

ఈ రెండు గ్రామాల్లో సుమారు 1600 ఎకరాలు అందుబాటులో ఉండటంతో భారీ స్టేడియం నిర్మించడానికి ఎలాంటి ఆటంకం ఉండదని అంటున్నారు. ఈ 1600 ఎకరాల్లో కొంత ప్రభుత్వ భూమి ఉండగా, మిగతాది పట్టా భూమిగా చెబుతున్నారు. వీటికి ప్రభుత్వ ధర చెల్లించి భూమి సేకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.

రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం ఉంటే టూరిజం అభివృద్ధికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది. సుమారు 1.25 లక్షల మంది వీక్షించేలా ఇబ్రహీంపట్నం వద్ద స్టేడియం నిర్మించాలని ప్రభుత్వ ఆలోచనకు ఆంధ్రా క్రికెట్ సంఘం కూడా ఓకే చెప్పిందని అంటున్నారు. స్టేడియం నిర్మాణానికి అయ్యే ఖర్చులో 60% బీసీసీఐ, 40 శాతం ఏసీఏ భరించనున్నాయని అంటున్నారు.

అంతేకాకుండా ఏటా కనీసం పది అంతర్జాతీయ మ్యాచులు ఇక్కడ జరిగేలా చూస్తానని ఐసీసీ అధ్యక్షుడు జై షా హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ ఇటీవల విశాఖ, దుబాయ్ ల్లో పర్యటించినప్పుడు జై షాతో సమావేశైన విషయం తెలిసిందే. అప్పట్లోనే అమరావతిలో అంతర్జాతీయ స్టేడియం, మ్యాచుల నిర్వహణపై చర్చలు జరిగాయంటున్నారు.

రాజధాని అమరావతిని హైదరాబాద్ హైవేతో కలిపే క్రిష్ణా ఐకానిక్ బ్రిడ్జి పక్కనే క్రికెట్ స్టేడియం నిర్మించడం వల్ల ఈ ప్రాంతానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వానికి ఏ మాత్రం ఖర్చు లేకుండా, బీసీసీఐ నిధులతోనే స్టేడియం రూపుదిద్దుకుంటుంది. దీనివల్ల క్రికెట్ పాటు ఇతర క్రీడలకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నారు. మొత్తానికి అమరావతికి సర్వ హంగులు అద్దడానికి సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఆకర్షిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment