*జనసేనకు సర్వే నిపుణుడి షాక్- మిమ్మల్ని గెలిపించింది ఆయనే..! తాజా విశ్లేషణ..!*
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఎనిమిది నెలల్లోనే ఇలా తమ వల్లే టీడీపీ గెల్చిందంటూ జనసేన చెప్పుకోవడంపై అన్ని పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలైతే జనసేనపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో జనసేనను టార్గెట్ చేస్తూ పోస్టులూ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నేతల కామెంట్స్ పై ప్రముఖ సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట స్పందించారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను గెలిపించింది స్థానిక ఓటర్లే, వారు కాకుండా ఇంకెవరైనా ఉన్నారనుకుంటే వారి ఖర్మ అంటూ స్థానిక టీడీపీ నేత వర్మను ఉద్దేశించి జనసేన నేత నాగబాబు చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. దీనిపై స్పందించిన సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట.. ఓ ట్వీట్ చేశారు. ఇందులో అలర్ట్ పిఠాపురం మాత్రమే కాదు..ఎక్కడైనా గెలిపించేది ప్రజలూ, పార్టీ కార్యకర్తలే! టీడీపీ మద్దతు లేకుంటే.. పాలకొండ, పోలవరం, రైల్వే కోడూరు లాంటి చోట్ల జనసేన గెలుపునకు ఛాన్స్ లేదని తేల్చేశారు.
కొన్ని చోట్ల జనసేన వల్ల టీడీపీ మెజారిటీ సాధించిందని, ఫైనల్లీ కూటమి మైత్రి వల్ల మాత్రమే అధికారంలోకి వచ్చాం అనుకోవడం ఓ భ్రమ అని ప్రవీణ్ పుల్లట స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాల మీద ఏహ్య భావంతో మీరు అఖండ విజయం సాధించారనే విషయం గుర్తుంచుకుంటే మంచిదన్నారు. ఎప్పటికప్పుడు వైసిపి సాధించిన ఓట్ల శాతం కూడా జ్ఞప్తికి వస్తే మీరు మూలాలు మరిచిపోరన్నారు.
చివరిగా బాటమ్ లైన్ అంటూ.. టీడిపి కష్టకాలంలో జనసేనాని ఆదుకున్నారని, జనసేన ఎక్కువ సీట్లు సాధించడంలో టీడీపీ కార్యకర్తల శ్రమ ఉందని తెలిపారు. మిమ్మల్ని విడగొట్టడానికి ఎవరో రానక్కర్లేదు. మీ భాగస్వామ్య పార్టీ చాలు అంటూ జనసేనకు ఆయన చురకలు అంటించారు. తద్వారా కూటమిలో విభేదాలకు కారణం కావొద్దంటూ జనసేనను సుతిమెత్తగా ఆయన హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పక్కాగా గెలుస్తుందని చాలా ముందుగా సర్వే గణాంకాలతో చెప్పిన వారిలో ప్రవీణ్ పుల్లట కూడా ఒకరు.