Site icon PRASHNA AYUDHAM

పాఠం చదవరాదు.. లెక్కలు చేయలేరు!

IMG 20250710 WA0011

** పాఠం చదవరాదు.. లెక్కలు చేయలేరు!

• సూర్యుడు, చంద్రుడికి తేడా తెలియదు

• పరిసరాలు, చరిత్రలపై అవగాహన లేనేలేదు

• రాష్ట్ర విద్యార్థుల సామర్థ్యాల్లో లోపాలు

• పరాక్‌-2024 జాతీయ సర్వేలో తేటతెల్లం

తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులు చదువులో రాణించడంలేదు. జాతీయ స్థాయి సగటు కంటే వెనుకబడి ఉన్నారు. ఈ మేరకు పర్ఫార్మెన్స్‌ అసెస్‌మెంట్‌ రివ్యూ అండ్‌ అనాలిసిస్‌ ఆఫ్‌ నాలెడ్జ్‌ ఫర్‌ హోలిస్టిక్‌ డెవలప్‌మెంట్‌ (పరాక్‌) సర్వే-2024లో ఆందోళనకరమైన నిజాలు వెలుగుచూశాయి. పరాక్‌ను ఇదివరకు నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే(న్యాస్‌)గా వ్యవహరించేవారు. మూడు, ఆరు, తొమ్మిదో తరగతి పిల్లలకు భాషలు, గణితం, సైన్స్‌లో ప్రతిభాపాటవాలను ఏ మేరకు ఉన్నాయో ఈ సర్వే ద్వారా తెలుసుకుంటారు.

దేశవ్యాప్తంగా విద్యాప్రమాణాలను అంచనా వేసేందుకు పరాక్‌ సర్వేను ప్రభుత్వాలు, విద్యాసంస్థలు కీలకంగా భావిస్తాయి. తాజాగా పరాక్‌-2024 సర్వే నివేదికను కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఇందులోని వివరాల ప్రకారం విద్యార్థులు వాక్యాలు చదవలేకపోతున్నారని, లెక్కలు చేయలేకపోతున్నారని, అంకెలను కూడా ఆరోహణ అవరోహణ క్రమంలో చెప్పలేకపోతున్నారని తేలింది. అంతేకాకుండా మూడో తరగతి విద్యార్థులకు సూర్యుడు, చంద్రుడి బొమ్మలను చూపిస్తే… ఏది ఏంటో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని సర్వేలో స్పష్టమైంది. చాలా అంశాల్లో జాతీయ సగటుతో పోల్చితే తెలంగాణ రాష్ట్రం వెనుకబడిందని తేలింది.

పరాక్‌ సర్వే- 3వ తరగతి విద్యార్థులు

• రోజువారి మాటల్లో సరైన పదాలు ఉపయోగించడం తెలిసినవారు 62%

• కథలు చెప్పి, అందులోని సారాంశాన్ని, సందేశాన్ని చెప్పగలిగేవారు 53%

• 1-99 వరకు అంకెలను ఆరోహణ, అవరోహణ క్రమంలో చెప్పగలిగేవారు 48%

• రెండంకెల సంఖ్యలతో కూడికలు, తీసివేతలు చేయగలిగేవారు 51%

• నిమిషం, గంట, రోజు, వారం, నెలపై అవగాహన కలిగినవారు 53% పరాక్‌ సర్వే- 6వ తరగతి విద్యార్థులు

• భాషల్లోని పాఠాలలో సందేహాలను వ్యక్తం చేయగలిగేవారు 52%

• పాఠాలలో సారాంశం తెలుసుకుని, ముగింపును అర్థం చేసుకోగలిగేవారు 54%

• గణితంలో స్థానం, పెద్ద సంఖ్యల విలువను చెప్పగలిగేవారు 54%

• భిన్నాలు, భాగాలు, విభజన చేయగలిగేవారు 24%

• మీటర్లు, సెంటీమీటర్లపై అవగాహన కలిగినవారు 34%

• దూరం, పొడవు, సమయం, చుట్టు కొలత, వైశాల్యం, బరువు గురించి తెలిసినవారు 37%

• గణిత సమస్యలు (పద పజిల్స్‌, మ్యాజిక్‌ స్వేర్‌ నిర్మాణం) పరిష్కరించేవారు 35%

• సూర్యచంద్రులు, నక్షత్రాలు, గ్రహాలను గుర్తించగలిగేవారు 38%

• బ్యాంక్‌, పోస్టాపీస్‌, మార్కెట్‌, పంచాయతీ కార్యకలాపాలు తెలిసినవారు 52% పరాక్‌ సర్వే- 9వ తరగతి విద్యార్థులు

• వార్తా కథనాలు, సంపాదకీయాలలో ముఖ్యాంశాలను గుర్తించగలిగేవారు 54%

• గణితంలో 7 గుణిజాలు, 3 ఘాతాలను గుర్తించగలిగేవారు 37%

• ఘన, ద్రవ, వాయు ఆకారాలు, ఘణపరిమాణం, సాంద్రత గురించి తెలిసినవారు 33%

• వాతావరణం, సముద్రం, నేల నిర్మాణం, నదుల ప్రవాహం గురించి తెలిసినవారు 31%

• చరిత్రలోని ప్రధాన ఘట్టాలు, సమాజంపై ప్రభావం గురించి చెప్పగలిగినవారు 34%

• భిన్నత్వంలో ఏకత్వం, భాషలు, కళలు, యోగా గురించి తెలిసినవారు 33%

Exit mobile version