ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి లక్షల రూపాయలు దోచుకుంటున్న మోసగాళ్లు పెరుగుతున్నారు..!
ప్రభుత్వ శాఖల్లో పరిచయాలున్నారని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు..!
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో రూ.2.10 లక్షలు ఎగవేసిన ఘటన నమోదు..!
ఫిర్యాదు చేసినా, పోలీసులు ఇంకా స్పష్టమైన పరిష్కారం చూపలేదని బాధితుల ఆవేదన..!
“అప్రమత్తంగా ఉండకపోతే మోసాలకు బలవ్వాల్సిందే” అని పోలీసుల హెచ్చరిక..!
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 19 (ప్రశ్న ఆయుధం):
ఉద్యోగం పేరుతో మోసాలు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుంటున్న మోసగాళ్లు, అమాయకుల ఆశలను దోచుకుంటున్నారు. ఈ క్రమంలో పేద, మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా బలవుతున్నాయి.
ఇటీవల నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో ఒక ఘటన చర్చనీయాంశమైంది. నాళేశ్వర్ గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడి నుండి, “మున్సిపాలిటీ ఉద్యోగం ఇప్పిస్తా” అని చెప్పి చిన్నయ్య అనే వ్యక్తి రూ.2.10 లక్షలు వసూలు చేశాడు. “నిజామాబాద్ మున్సిపాలిటీ ఉద్యోగి అనిల్ పరిచయం ఉంది” అని నమ్మబలికిన చిన్నయ్య, ప్రశాంత్ మామయ్య రవి ద్వారా పలు దఫాలుగా డబ్బులు సేకరించాడు. డబ్బులు తన ఖాతాకు కాకుండా ఇతరుల ఖాతాలకు పంపమని చెప్పి గందరగోళం సృష్టించాడు.
తొమ్మిది నెలలు గడిచినా ఉద్యోగం రాకపోవడంతో ప్రశాంత్, చిన్నయ్యను నిలదీయగా — మొదట “15 రోజుల్లో డబ్బులు తిరిగి ఇస్తా” అన్నాడు. తర్వాత “రెండు నెలలు పడుతుంది” అంటూ కాలయాపన చేశాడు. చివరికి “నేను డబ్బులు తీసుకోలేదని” తిరస్కరించడం బాధితులను మరింత వేదనకు గురిచేసింది.
ఈ విషయం మీద నవీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చిన్నయ్యను పిలిపించి విచారించినా, ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు హెచ్చరిక..!!
ఇలాంటి ఘటనలపై ఇప్పటికే నిజామాబాద్ సీపీ ప్రజలను పలు మార్లు అప్రమత్తం చేశారు. అయినప్పటికీ “ఈజీ మనీ” ఆశతో కొందరు గృహిణులు సైతం “ఇంట్లో కూర్చొని వేల రూపాయలు సంపాదించొచ్చు” అనే నమ్మకంతో మోసపోతున్నారు. అప్పులు చేసి డబ్బులు చెల్లించిన నిరుద్యోగులు చివరికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తోంది.
పోలీసులు చెబుతున్నారు:
“ముందుగా మనం జాగ్రత్తగా ఉంటేనే మన సమాజాన్ని కాపాడగలం. మోసపోయిన తర్వాత పశ్చాత్తాపం ప్రయోజనం ఉండదు. అప్రమత్తమే ఆయుధం.”