*స్టీరింగ్ పట్టి ఆర్టీసీ బస్సు నడిపిన మంత్రి*
పెనుకొండ బస్టాండ్ లో నూతనంగా మంజూరైన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి సవిత
ఓ బస్సును స్వయంగా నడిపి చూసిన మంత్రి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 400 బస్సులు కొనుగోలు చేసినట్లు వెల్లడి
ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత బస్సు నడిపి ఇటు అధికారులను, అటు పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఆర్టీసీ డిపోకు నూతనంగా రెండు బస్సులు మంజూరు అయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం పెనుకొండ బస్టాండ్ లో నూతనంగా మంజూరైన రెండు ఆర్టీసీ బస్సులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా ఓ బస్సు ట్రైల్ రన్ చేశారు. మంత్రి సవిత స్టీరింగ్ పట్టుకుని బస్సు నడపడంతో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, పార్టీ శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యారు.
అనంతరం మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం పదివేల కోట్లు అప్పు చేసినా మౌలిక వసతుల కల్పనకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. కొత్త బస్సులను గత ప్రభుత్వంలో కొనుగోలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 400 బస్సులు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం మధుసూధన్, సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.