Site icon PRASHNA AYUDHAM

నెలాఖరు లోగా ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ సర్వే పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 12 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ సర్వే ను నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడిఓసి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ మరియు నూతన డైట్ మెనూ పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాల పై అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన లతో కలిసి జిల్లాలోని ఆర్డీవోలు, తాసిల్దార్లు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ సెక్రటరీలు మరియు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే త్వరితగతిన పూర్తయ్యేలా తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ సెక్రటరీలు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తు నమోదు చేపట్టాలని, నమోదు ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. దరఖాస్తుదారులు ఒకచోట నివసిస్తూ ఉండి వారికి వేరొక ప్రదేశంలో స్థలం ఉన్నచో అటువంటి దరఖాస్తులను తీసుకొని వివరణలో తగిన వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రతి దరఖాస్తులు యాప్ లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా మండల మరియు గ్రామస్థాయిలో ఎన్ని దరఖాస్తులు ఉన్నవి నివేదికలు తయారు చేసుకొని ఎక్కువ దరఖాస్తులు ఉన్నచోట సర్వేకు అదనపు సిబ్బందిని కేటాయించాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం మరియు కొత్తగూడెం ఆర్డీవోలు ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌస్ నిర్మాణం కోసం స్థలం గుర్తించి త్వరితగతిన మోడల్ హౌస్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 15,16 తేదీలలో గ్రూప్ టు పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు.ఈ నెల 15వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ – 1 పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ – 2 పరీక్ష, అలాగే 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ – 3 పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ – 4 పరీక్ష జరగనుందని తెలిపారు.
జిల్లాలో మొత్తం (13465) మంది అభ్యర్థులు (38) పరీక్ష కేంద్రాల్లో ఈ గ్రూప్-2 పరీక్షకు హాజరుకానున్నట్లు వివరించారు. అలాగే చీఫ్ సూపరింటెండెంట్ లు (38), డిపార్ట్మెంటల్ అధికారులు (38), అబ్జర్వర్ లు (40), ఫ్లయింగ్ స్క్వాడ్ లు (12), బయోమెట్రిక్ అధికారులు (43), ఐడెంటిఫికేషన్ అధికారులు (134), ఆరు రూట్లలో ఆరుగురు లోకల్, జాయింట్ రూట్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లను అనుమతించరాదన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయాలన్నారు.
పరీక్ష సమయానికి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పరీక్ష కేంద్రాలను సంబంధిత అధికారులు సందర్శించి, మౌలిక వసతులను కల్పించాలని, నిరంతర విద్యుత్ సరఫరా జరగాలని, ఆర్టీసీ బస్సులు సరిపడా అందుబాటులో ఉంచాలన్నారు.పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ కిట్, సిబ్బంది అందుబాటులో ఉండాలని, పరీక్ష పేపర్లు, ఓఎంఆర్ షీట్ లను పకడ్బందీగా,తగిన జాగ్రత్త చర్యల నడుమ తప్పనిసరిగా ఎస్కార్ట్ తో ప్రభుత్వ వాహనాల్లో పరీక్ష కేంద్రాలకు తరలించాలని, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సమయానుకూలంగా వ్యవహరించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పిల్లలు అందించే డైట్ చార్జీలను 40 శాతం పెంచిందని, డైట్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవోలు, జిల్లా అధికారులు మరియు పంచాయతీ అధికారులు తమ పరిధిలోని హాస్టల్స్ ఆశ్రమ పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలు అన్ని రకాల పాఠశాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలన్నారు. 40% డైట్ చార్జీలు పెంచినందున పిల్లలకు నాణ్యమైన భోజనం అందుతుందని దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.డైట్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులను ఆహ్వానించాలని, ముఖ్యంగా తల్లి హాజరయ్యే విధంగా చూసుకోవాలని అన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డైట్ చార్జీల పెంపు లాంచ్ కార్యక్రమం జరగాలని, ఆ రోజు విద్యార్థులకు స్పెషల్ ఆహారం అందించాలని, ప్రతి విద్యా సంస్థలు మెన్యు కు సంబంధించి వివరాల ఫ్లెక్సీ ప్రచురణ చేయాలని అన్నారు.

Exit mobile version