సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): దేశంలో సామాజిక అసమానతలు తొలగి అన్ని వర్గాల ప్రజలకి ఆర్థిక, సామాజిక, న్యాయ, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు దక్కినప్పుడే దేశం ప్రగతి బాటలో పయనిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్న దేశంలో ఇంకా ఆర్థిక సామాజిక అసమానతలు కొనసాగడం దురదృష్టకరమన్నారు. అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాధికారం దక్కినప్పుడే సామాజిక అసమానతలు తొలగి దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని తేల్చి చెప్పారు. ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి స్వాతంత్ర్యం సాధించి దేశ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీ నేడు అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందిస్తూ ప్రజారంజక పాలన కొనసాగిస్తుందని కొనియాడారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ సాక్షిగా 42శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించడాన్ని ఆయన ఉదహరించారు. 42 శాతం రిజర్వేషన్ అమల్లోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ బిడ్డలు పెద్ద ఎత్తున లబ్ధి పొందుతారని స్పష్టం చేశారు. మహనీయుల ఆశయాలను అనుసరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సామాజిక అసమానతలు తొలగినప్పుడే దేశ ప్రగతి: నీలం మధు ముదిరాజ్
Oplus_131072