ఏజెంట్లు ఆఫీసులో అడ్డగోలు తిరుగుడు..
ఏజెంట్లతో సిబ్బంది దోస్తీ..?
ప్రజలను పీడిస్తున్న ఏజెంట్ల వ్యవస్థ..
ఆనిశా అధికారులు దృష్టి సారించాలి.
భద్రాచలం పట్టణంలో మోటార్ వెహికల్ తనిఖీ అధికారి కార్యాలయం కలదు. ఈ కార్యాలయం నందు పినపాక, భద్రాచలం నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన వాహనాల సేవలు లభిస్తాయి. ఈ కార్యాలయం నుండి ప్రతినిత్యం వందలాదిమంది తమ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, రెన్యువల్, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు, లైసెన్సులు పొందుతుంటారు. ఈ సేవలను ప్రభుత్వం దళారులకు సంబంధం లేకుండా ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తులను స్వీకరించి వెహికల్ ఇన్స్పెక్టర్ వద్ద తనిఖీలు పొందుతుంటారు. ప్రభుత్వం ఏజెంట్ వ్యవస్థను రద్దు చేసినా భద్రాచలం పట్టణంలో మాత్రం భద్రాచలం పినపాక నియోజకవర్గం నుండి సుమారు 100 మంది ఏజెంట్లు ప్రజల వద్ద నుండి ముక్కు పిండి డబ్బులు వసూలు చేసి ఒక్కొక్క సర్వీస్ కు ఒక్కో రేటు పెట్టి దండుకుంటున్నారు. గతంలో పలుమార్లు అనేక పత్రికలలో, సోషల్ మీడియాలలో కథనాలు వచ్చిన ఏ అధికారి పట్టించుకోకుండా ఉన్నారంటే అర్థం ఏమిటో తెలియడం లేదు. ఏజెంట్లు తమ లక్షలాది రూపాయల సంపాదనను అధికారులకు కూడా మామూలుగా పంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏజెంట్లు ఆఫీసు పనివేళలోనే కాకుండా ఇతర సమయాలలో కూడా కార్యాలయంలో లోపల తమ ఇష్టానుసారంగా తిరిగినా ఏ అధికారి, అక్కడ పనిచేసే సిబ్బంది పట్టించుకోకుండా ఉన్నారంటే అధికారులు ఎంత చనువిస్తున్నారో అర్థమవుతుంది. ప్రతినిత్యం లక్షలాది రూపాయలను అక్కడ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిరోజు వందలాది ఇసుక లారీలు అధిక లోడ్లతో వెళుతున్నారని ఫిర్యాదులు అందిన ఈ కార్యాలయ అధికారి మాత్రం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం జరుగుతుంది. జిల్లా రవాణా అధికారి ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా ఉన్నారంటే ఇసుక మాఫియా ఎంత బలంగా అధికారులపై ఒత్తిడి తెస్తుందో గమనించవచ్చు. తక్షణమే ఈ కార్యాలయం పై అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించి అక్కడ పనిచేసే సిబ్బందిపై అధికారులపై నిఘా పెట్టాలని, ఏజెంట్లను కార్యాలయ ఆవరణలోకి రానివ్వకుండా జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.