పండుగ పూట పంచాయతీ సిబ్బంది పస్తులుండాలా…

•తక్షణమే బకాయి వేతనాలు చెల్లించాలి.

•మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలి. వేతనాలు పెంచాలి

• CITU మెదక్ జిల్లా అధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 11 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తూప్రాన్ విలేకరులతో మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, డంపింగ్ యార్డ్స్, హరితహారం, పల్లె పకృతి వనాలు, వైకుంఠధామాలు తదితర పనుల్లో నిత్యం శ్రమిస్తూ గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ప్రజలకు సేవలందిస్తున్నారు. సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తున్నా నేటికీ పనికి భద్రత, శ్రమకు తగిన వేతనం, ఎలాంటి గుర్తింపుకు నోచుకోలేదు. ఇస్తున్నదే అతితక్కువ వేతనాలు, అవికూడ నెలల తరబడి చెల్లించక పోవడంతో కార్మికులు అప్పుల పాలై అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. సంక్రాంతి పండుగ పూట కూడా పంచాయతీ కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తక్షణమే బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వం పంచాయతీ కార్మికుల మెడకు ఉరితాళ్ళను బిగించి మల్టీపర్పస్ వర్కర్ పేరుతో కేటగిరీలన్నింటిని రద్దు చేసింది..
ఆనాటి నుండి నేటి వరకు మల్టీపర్పస్ వర్కర్ పంచాయతీ కార్మికులు అన్ని రకాల పనులు చేయడం వల్ల ఆ పనులలో నైపున్యం లేక పనిచేసే క్రమంలో ప్రమాదాలు జరిగి అనేక మంది కార్మికులు మరణించారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించక పోవడంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మల్టీపర్పస్ వర్కర్ పేరుతో కేటగిరీలన్నింటిని రద్దు
చేయడంతో చదువు, అర్హత, సీనియార్టి ఉన్న కలం పట్టిన కారోబార్, బిల్ కలెక్టర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి పర్మినెంట్ చేస్తామని తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ ప్రకటనతో పంచాయతీ కార్మికులలో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పెరిగింది. పంచాయతీ కార్మికులందరూ కాంగ్రెస్ పార్టీ గెలుపును కాంక్షిస్తూ ఓట్లు వేసి గెలిపించారు.ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. అధికారం చేపట్టి 12 నెలలు గడుస్తున్నప్పటికీ మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు, పిఆర్సిలో పంచాయతీ కార్మికుల గుర్తింపు, కనీస వేతనాల అమలు, కారోబార్,బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ లాంటి డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో ఎదురు చూసిన కార్మికుల ఆశలు నిరాశలైనాయి.అన్ని గ్రామాలలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తాగునీటి వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సల్ జల్ మిత్ర పేరుతో చేపట్టిన పథకంలో భాగంగా పంచాయతీలలో పనిచేస్తున్న పంప్ ఆపరేటర్లను ఎంపిక చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా 12,790 గ్రామాల్లో 13,102 మందిని విలేజ్ వాటర్ అసిస్టెంట్లుగా నియమిస్తున్నారు. 2024 సెప్టెంబర్ 23 నుండి నాలుగు అంశాలపై ఇప్పటికే శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్ల ద్వారా తాగునీటి సరఫరా, లీకేజీల నివారణ, మోటర్లు, బోరింగ్ల మరమ్మతులు, క్లోరినేషన్ పనులు చేసేందుకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న విలేజ్ వాటర్ అసిస్టెంట్లను గతంలో ఉన్న ఆర్.డబ్ల్యూఎస్ (మిషన్ భగీరథ) శాఖలో అనుసంధానం చేస్తూ వీరి పనీపై పర్యవేక్షణ అంత మిషన్ భగీరథ అసిస్టెంట్ ఇంజనీర్లు, జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పరిధికి అప్పగిస్తున్నారు. ఈ నిర్ణయం వలన అనేక సంవత్సరాలుగా వాటర్ సప్లైలో పనులు చేస్తున్న పంప్ ఆపరేటర్ల సీనియార్టి వారి అనుభవం గుర్తింపు లేకుండా పోతుంది. గతంలో మిషన్ భగీరథ సిబ్బంది ద్వారానే మంచినీటి సరఫరా జరిగేది, అది సాధ్యం కాకపోవడంతో గ్రామాలలో మంచినీటి సరఫరాను 2023 జనవరి నుండి గ్రామ పంచాయతీలకు అప్పగించారు. అనాటి నుండి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పంచాయతీలలో పనిచేస్తున్న పంప్ ఆపరేటర్లు ప్రజలకు సేవలందిస్తున్నారు. వీరి సేవలను ప్రభుత్వం గుర్తించాలని, విలేజ్ వాటర్ అసిస్టెంట్లుగా నియమిస్తున్న వారందరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇతర ప్రభుత్వ శాఖాలలో చెల్లిస్తున్న వేతనాలను అమలు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్( సిఐటియు) అధ్యక్షులు ఎం నర్సింలు ఉపాధ్యక్షులు జీవన్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment