ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
–కామారెడ్డి ఆరోగ్య మిత్రల జిల్లా అధ్యక్షుడు.. అల్లావుద్దీన్
ప్రశ్నాయుధం న్యూస్, ఆగస్టు 31, కామారెడ్డి :
ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమ్మెలో భాగంగా శనివారం 11 వ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి కామారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ మిత్రాలు హాస్పిటల్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అల్లావుద్దీన్ మాట్లాడుతూ… సమ్మె నోటీస్ ఇచ్చి 20 రోజులు గడిచిపోయినప్పటికీ నేటికీ సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ అధికారులు, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించడం బాధాకరమన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో సెప్టెంబర్ 2 వ తేదీ నుండి విధులను బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున తక్షణమే న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించి ప్రభుత్వం తమపై ఉదారతను చాటుకోవాలని పేర్కొన్నారు. అదే విధంగా వివిధ ఆసుపత్రుల్లో 25 మంది ఆరోగ్యమిత్రలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య మిత్రాలు గంగాధర్ ,అంజయ్య ,మహేష్, నిర్మల తదితరులు పాల్గొన్నారు.