Site icon PRASHNA AYUDHAM

కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి

కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి

తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ డిమాండ్

ప్రశ్న ఆయుధం , సెప్టెంబర్ 29, కామారెడ్డి :

రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం సంఘం జిల్లా సమావేశం నిర్వహించారు. గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎక్సైజ్ శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ లకు రాష్ట్ర ప్రతినిధి బృందం ఇప్పటికే రెండుసార్లు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. వృత్తిలో ప్రమాదం వలన వందలాదిమంది గీత కార్మికులు చెట్టుపై నుండి పడి చనిపోవడం, వికలాంగులవుతున్నారని, ఇప్పటికే 520 మంది ప్రమాదానికి గురయ్యారని, గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షలు రూపాయలు ఎక్స్ గ్రేషియా నెలరోజుల లోపు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదని,ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదన్నారు. ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు తక్షణమే వీటిపై స్పందించాలని, టాడి కార్పొరేషన్ నుండి ఇచ్చే తక్షణ సహాయం తీవ్ర జాప్యం జరిగిందని, వాటిని వెంటనే అందివ్వాలన్నారు. బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి కేటాయించిన 22.20 కోట్ల రూపాయలతో నిర్మించిన నీరా కేఫ్ ని ఎలాంటి సంబంధం లేని టూరిజం డిపార్ట్మెంట్ నుంచి తొలగించి, టాడి కార్పొరేషన్ కి అప్పగించాలని,ప్రతి జిల్లాలో నీరా తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేసి యువతి, యువకులకు ఉపాధి కల్పించాలని, చెట్ల పెంపకానికి ప్రతి సొసైటీకి జీవో నెంబర్ 560 ప్రకారం 5 ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఆగస్టు 18 లోపు నిర్మించాలని, జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలని,50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికునికి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, కుల గణన తక్షణం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని, కల్తీ కల్లు పేరిట ఎక్సైజ్ దాడులు ఆపాలని, ప్రతి గ్రామానికి చెట్లు పెంచుకోవడానికి 5 ఎకరాల భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ తో పాటు జిల్లా నాయకులు శేఖర్ గౌడ్, నర్సు గౌడ్, రామా గౌడ్, లింగం గౌడ్, బాలా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version