వరి కొనుగోలు ఈ నెలాఖరుకే పూర్తి చేయాలి
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశాలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 27
గురువారం
జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను ఈ నెలాఖరుకే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో ఐకేపీ, సివిల్ సప్లై, ఫాక్స్, ఇతర శాఖల అధికారులతో వరి కొనుగోలు పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ— రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో తక్షణ వరి స్వీకరణ, తూకాలు, రవాణా వంటి కీలక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి కేంద్రంలో తగిన సంచులు, వాహనాలు, సిబ్బంది అందుబాటులో ఉండేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు కేంద్రాల వారీగా జరిగిన కొనుగోలు వివరాలు, ఇంకా ఎంత కొనుగోలు జరగాల్సి ఉంది, ట్యాబ్ ఎంట్రీలు, చెల్లింపుల పురోగతిపై వివరాలు తెలుసుకున్న కలెక్టర్— ఈ నెల చివరి నాటికి అన్ని కేంద్రాల్లో వరి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతుల వరిని పూర్తిగా కొనుగోలు చేయడంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖలను ఆయన సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ విక్టర్, DRDO, సివిల్ సప్లై, ఫాక్స్ అధికారులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.