కేజ్రీవాల్‌కు దక్కని ఊరట…
సెప్టెంబర్ 3 వరకూ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సిబీఐ నమోదు చేసిన కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎలాంటి ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని సెప్టెంబర్ 3న తేదీ వరకూ రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారంనాడు పొడిగించారు. ఇంతకుముందు విధించిన కస్టడీ గడువు నేటితో ముగియడంతో కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. సీబీఐ దాఖలు చేసిన నాల్గవ ఛార్జిషీటుపై నిర్ణయాన్ని కూడా రౌస్ ఎవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఈ ఛార్జిషీటులో కేజ్రీవాల్, మరో ఐదుగురి పేర్లను సీబీఐ చేర్చింది. సెప్టెంబర్ 3న దీనిపై కోర్టు విచారణ జరపనుంది. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
కాగా, ఎక్సైజ్ పాలసీ కేసులో బెయిలు కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి సుప్రీంకోర్టు ఇంతకుముందు వాయిదా వేసింది. అఫిడవిట్ సమర్పించేందుకు మరింత గడువు కావాలని సీబీఐ కోరడంతో అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ తనకు బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఒక పిటిషన్, సీబీఐ అరెస్టుకు వ్యతిరేకంగా మరో పిటిషన్ వేసారు. అయితే సీబీఐ తమ సమగ్ర అఫిడవిట్‌లో ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ కేజ్రీవాల్ డైరెక్షన్‌లో నాటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కలిసి తీసుకున్నవేనని సీబీఐ ఆరోపణగా ఉంది. అయితే ఈ ఆరోపణలను ఆప్ తోసిపుచ్చుతూ కేజ్రీవాల్‌ను జైలులోనే ఉంచేందుకు బీజేపీ, సీబీఐ కుట్రపన్నుతున్నాయని చెబుతోంది.