*సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్ల పాత్ర కీలకం: తెలంగాణ మంత్రులు*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 22
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని, లబ్ధిదారులకు పథకాల ఫలాలు చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు.
మంగళవారం డా. బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి మంత్రులు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, రెసిడెన్షియల్ పాఠశాలల్లో భోజన, మౌలిక వసతులు, వనమహోత్సవం, మహాలక్ష్మి పథకం వంటి కీలక అంశాలపై సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రారంభించిన సంక్షేమ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, అధికారులు ముఖ్య భూమిక పోషించాలని, పేద ప్రజలకు పథకాలు అందేలా పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని మంత్రులు స్పష్టం చేశారు.
హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, వసతులుపై దృష్టి:
సాంఘిక, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, హాస్టళ్ల నిర్వహణను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని మంత్రులు ఆదేశించారు. వారంలో ఒక్కరోజు అధికారులు హాస్టళ్లలో బస చేయాలని సూచించారు. పెంచిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా నాణ్యమైన భోజన వసతి కల్పించాలని సీఎస్ రామకృష్ణారావు సూచించారు. హాస్టళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని ఆదేశించారు. హాస్టళ్ల ప్రాంగణాల్లో పచ్చదనం, పరిశుభ్రతను పాటించాలని, అన్ని జిల్లాల్లో ఎగ్ టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో నెలకు ఒకసారి పేరెంట్స్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కూడా కోరారు.
మహాలక్ష్మి పథకం విజయవంతం:
మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా 97 బస్సు డిపోలు, 321 బస్ స్టేషన్లలో వేడుకలు నిర్వహించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లు, భూభారతిపై ప్రత్యేక ఆదేశాలు:
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఇళ్ల నిర్మాణంలో ఇసుక కొరత లేకుండా చూడాలని, ఇసుక రవాణాలో లబ్ధిదారుడికి ఎలాంటి భారం పడకుండా ఉచితంగా అందజేయాలని సూచించారు. భూభారతిలో నమోదైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు.
వనమహోత్సవంలో మొక్కలు నాటాలని సూచన:
వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో విరివిగా మొక్కలు నాటాలని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, విజయేందర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.