ఆర్టిఐ చట్టం పారదర్శకంగా అమలు చేయాలి
ప్రజల విశ్వాసం పొందడమే లక్ష్యం
— కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 10
జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో సమాచార హక్కు చట్టం (RTI Act–2005) ను పారదర్శకంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్టిఐ వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీ తత్వం పెంపొందించేందుకు ఆర్టిఐ చట్టం తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రజలు అడిగిన సమాచారాన్ని ఎలాంటి దాపరికం లేకుండా నిర్ణీత సమయంలో, నిర్ణీత విధానంలో అందించాలని పీఐఓలకు సూచించారు. ఆర్టిఐ చట్టం ప్రజలకు ప్రభుత్వ పనితీరుపై నమ్మకం కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
ఆర్టిఐ చట్టంలోని మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ప్రతి శాఖా అధికారులు ప్రజలకు సమయానికి సమాచారం అందించేలా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) చందర్ నాయక్, డీఆర్వో మధు మోహన్, ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థసింహారెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, కలెక్టరేట్ ఏవో, సెక్షన్ ఆఫీసర్లు, ప్రభుత్వ కార్యాలయాల పీఐఓలు తదితరులు పాల్గొన్నారు.