అమరవీరుల త్యాగమే నేటి శాంతి, సౌభ్రాతృత్వానికి పునాది: 

అమరవీరుల త్యాగమే నేటి శాంతి, సౌభ్రాతృత్వానికి పునాది:

 

— కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్

 

 

అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు – కుటుంబాలకు సానుభూతి, సహాయ హామీ

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 21

 

 

“అమరవీరుల త్యాగనిరతి వల్లే నేడు మన సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొంది,” అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఐఏఎస్ పేర్కొన్నారు.

పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్‌తో పాటు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్, పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

 

కలెక్టర్ మాట్లాడుతూ —

“ప్రజల భద్రత, శాంతి స్థాపన కోసం ప్రాణాలను అర్పించిన పోలీసులు మన గర్వకారణం. వారిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. వారి కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది,” అన్నారు.

కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 7 మంది పోలీసులు అంతర్గత భద్రత విధుల్లో అమరులయ్యారని, వారి త్యాగం వల్లే నేడు జిల్లాలో శాంతి భద్రతలు బలపడ్డాయని పేర్కొన్నారు.

 

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ మాట్లాడుతూ —

“అమరవీరుల త్యాగం చిరస్మరణీయం. సమాజ శాంతి భద్రతల కోసం అసాంఘిక శక్తులతో పోరాడి ప్రాణత్యాగం చేసిన వీరులను మనం గర్వంగా స్మరించాలి,” అన్నారు.

“1959 అక్టోబర్ 21న లడక్‌లో చైనా దళాల దాడిలో 10 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన రోజునే పోలీస్ అమరవీరుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం,” అని గుర్తుచేశారు.

 

ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసులు విధి నిర్వాహణలో వీరమరణం పొందగా, తెలంగాణ రాష్ట్రం నుండి 5 మంది పోలీసు సిబ్బంది — అసిస్టెంట్ కమాండెంట్ బానోత్ జవహర్‌లాల్, కానిస్టేబుళ్లు టి. సందీప్, వడ్ల శ్రీధర్, యం. పవన్ కళ్యాణ్, బి. సైదులు — అమరులయ్యారని ఎస్పీ తెలిపారు.

 

“విధి నిర్వాహణలో ప్రాణత్యాగం చేసిన వీరుల ఆశయాలను నెరవేర్చడం, వారి కుటుంబాలకు మానసిక బలం, ఆర్థిక భరోసా కల్పించడం — అదే వారికి మనం అందించే నిజమైన నివాళి,” అని ఆయన అన్నారు.

అమరవీరుల స్మరణార్థం జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 31 వరకు రక్తదాన శిబిరాలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు, వ్యాసరచన, ఫోటో మరియు వీడియో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అమరవీరుల కుటుంబాలను వ్యక్తిగతంగా కలుసుకుని గౌరవప్రదంగా నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కే. నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్, సీఐలు నరహరి, రామన్, సంతోష్ కుమార్, ఆర్ఐలు. నవీన్ కుమార్, సంతోష్ కుమార్, కృష్ణ, ఎస్ఐలు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

 

వారి త్యాగం మనకు స్ఫూర్తి… వారి సేవలు చిరస్మరణీయం!

 

Join WhatsApp

Join Now

Leave a Comment