సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్రం ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. బుధవారం అందోల్ మార్కెట్ యార్డ్ లో సంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల సంస్థ అద్వర్యం లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్నారు. రైతులు పండించిన ప్రతి వరి గింజను కొనుగోలు చేస్తామన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. సంగారెడ్డి జిల్లాలో 216 కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన ధరకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం దాన్యం పంటల సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలుకు రూ.500 రూపాయల బోనస్ ను అందిస్తున్నామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటలలో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. వరి ధాన్యాన్ని సహకార సంఘాలు, ఐకెపి, డీసీఎంఎస్ లతో పాటు రైతులు రైతు ఉత్పత్తిదారుల సంస్థల ( ఎఫ్ పిఓ) ద్వారా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందుకు వస్తే వారికీ అవకాశం కల్పించి కొనుగోలు కేంద్రాలను పెంచుతామన్నారు. అందోల్ నియోజక వర్గంలో ప్రతి గ్రామంలో చెరువు, కుంటలు ఉన్నాయన్నారు. 2005 – 06లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి సహకారంతో సింగూర్ కాల్వ ఇవ్వడం వల్ల 40 వేల ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. నియోజక వర్గంలో వరి, పత్తి పంటలు అత్యధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తారన్నారు. జిల్లాలో సాగు నీటి వ్యవస్థ కు పూర్తి సహకారం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) మాధురి, అందోల్ ఆర్డీవో పాండు, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ శేరి జగన్ మెహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ జగన్ మోహన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు సురేందర్ గౌడ్, చిట్టుబాబు, కళాలి రమేష్ గౌడ్, పిఎసిఎస్ ఛైర్మన్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
Oplus_16908288