స్వర్ణ యుగాన్ని తలపిస్తున్న తెలంగాణ సర్కార్
– ఏడాదిలోనే ప్రతిష్టాత్మక పథకాలతో దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
– ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు
– జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో స్వర్ణ యుగాన్ని తలపిస్తోందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో పర్యటించి అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి దరఖాస్తులు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ 2 లక్షల పంట రుణమాఫీ చేసి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. అంతేకాకుండా ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేద వర్గాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ సరఫరా, రూ 500 కే గ్యాస్ సిలిండర్ పంపిణీ తదితర సంక్షేమ పథకాలు వర్తింపజేయగా, ప్రస్తుతం అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు, ఇంటి నిర్మాణం కోసం రూ 5 లక్షలు ఇస్తున్న క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ జీర్ణించుకోలేక పోతున్నట్లు ఎద్దేవా చేశారు. పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి అన్ని రకాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గం గత పదేళ్లుగా ఎవరూ లేని అనాధగా మారిందని, కష్టాలు చెప్పుకునేందుకు కరువైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మూడుసార్లు కేసీఆర్ కు ఓటేసి గెలిపిస్తే పత్తా లేకుండా పొగ, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలతో జల్సాలు చేస్తున్నట్లు విమర్శించారు. అంతేకాకుండా బిఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఒరగబెట్టిందేమీ లేదని, వారి స్వంత ఆస్తులు కూడపెట్టుకోవడానికి సమయం సరిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న తీరు గమనించి బిఆర్ఎస్ అవినీతి, అక్రమాలపై నిలదీయాలని అన్నారు. ఇక్కడి యువత కోసం, నిరుద్యోగ నిర్మూలన లక్ష్యంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉందామని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు గంగిశెట్టి రాజు, మజీద్ కమిటీ చైర్మన్ మతిన్, వార్డు ఇన్చార్జి రమేష్ గౌడ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, నాయకులు గుంటుకు శ్రీనివాస్, ఊడెం శ్రీనివాసరెడ్డి, గాడిపల్లి శ్రీనివాస్, బలరాం, అజహార్, సురేష్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.