బీజేపీ దూకుడుకు ఆ ముగ్గురికి కళ్లెం

బీజేపీ దూకుడుకు ఆ ముగ్గురి కళ్లెం

  • 2019 తర్వాత కేంద్రంలో ఇక తమకు తిరుగులేదనుకున్నది బీజేపీ. కానీ, తూర్పున మమత, ఉత్తరాన కేజ్రీవాల్‌, దక్షిణాన కేసీఆర్‌ రూపంలో ఆ పార్టీకి గట్టి దెబ్బ తాకింది. అప్పటికే 8 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూలగొట్టిన ఆ పార్టీ, శివసేన వంటి పార్టీల అస్తిత్వాన్నే కనుమరుగు చేసింది. ఉత్తరాన కేజ్రీవాల్‌ దూసుకుపోయే ప్రయత్నం చేయడం, ముఖ్యంగా మహారాష్ట్రతో పాటు గుజరాత్‌ రాజకీయాల్లోకి దూసుకురావడం మోదీ-షా ద్వయానికి ఇబ్బందిగా మారింది.

August 9, 2025

బీజేపీ దూకుడుకు ఆ ముగ్గురి కళ్లెం

2019 తర్వాత కేంద్రంలో ఇక తమకు తిరుగులేదనుకున్నది బీజేపీ. కానీ, తూర్పున మమత, ఉత్తరాన కేజ్రీవాల్‌, దక్షిణాన కేసీఆర్‌ రూపంలో ఆ పార్టీకి గట్టి దెబ్బ తాకింది. అప్పటికే 8 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూలగొట్టిన ఆ పార్టీ, శివసేన వంటి పార్టీల అస్తిత్వాన్నే కనుమరుగు చేసింది. ఉత్తరాన కేజ్రీవాల్‌ దూసుకుపోయే ప్రయత్నం చేయడం, ముఖ్యంగా మహారాష్ట్రతో పాటు గుజరాత్‌ రాజకీయాల్లోకి దూసుకురావడం మోదీ-షా ద్వయానికి ఇబ్బందిగా మారింది. ఒక దశలో ఎన్నికల ఫలితాలు తమకు వ్యతిరేకంగా రావొచ్చేమోనన్న ఆందోళన కూడా బీజేపీ నేతలకు కలిగింది. ఈ క్రమంలో మోదీ-షా ద్వయం ఈ ముగ్గురిపై దృష్టిసారించింది.

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ బీజేపీకి ఊపిరి సలపకుండా చేశారు. నితీశ్‌ కుమార్‌, స్టాలిన్‌ లాంటి వాళ్లతో ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదమేమీ లేదు. ఇక ఏపీ విషయానికి వస్తే… ఒక రు బయటి స్నేహితుడైతే, మరొకరు పొత్తు స్నేహితుడు. ఇక తెలంగాణలో కేసీఆర్‌ తెచ్చిన పథకాలకు మంచి ఆదరణ రావడంతో కేంద్ర ప్రభుత్వం కొన్నింటిని అనుసరించాల్సి వచ్చిం ది. వాటిలో ఒకటి ‘రైతుబంధు’ నుంచి ‘కిసా న్‌ సమ్మాన్‌ యోజన’. రెండు ‘మిషన్‌ భగీరథ’ నుంచి ‘హర్‌ ఘర్‌ జల్‌ యోజన’.. మూడు ‘మిషన్‌ కాకతీయ’ నుంచి ‘మిషన్‌ అమృత్‌ సరోవర్‌’. ఎప్పుడైతే తెలంగాణ పథకాలను దేశానికి బీజేపీ పరిచయం చెయ్యాల్సి వచ్చిం దో అప్పటి నుంచీ గుజరాత్‌ మోడల్‌ అనే మాటే కనుమరుగైంది.

బెంగాల్‌, ఢిల్లీలలో మమత, కేజ్రీవాల్‌ ప్రభుత్వాలను కూలగొట్టడం సాధ్యం కాదు కాబట్టి, స్కాంల సినిమాలను విడుదల చేసింది కేంద్రం. బెంగాల్‌లో శారదా స్కాం తెచ్చి ఒకరిద్దరిని తమ పార్టీలో చేర్చుకున్నారు కానీ, మమతను లొంగదీసుకోవడం సాధ్యం కాలేదు. ఇక కేజ్రీపై లిక్కర్‌ స్కాం తెచ్చి, చివరికి ఢిల్లీలో ఓడించిన తర్వాత తృప్తి చెందారు. ఇప్పుడు ఆ కేసు విచారణ ఏమైందో.. ఎక్కడుందో.. ఎవ్వరికీ తెలియదు. ఇక దక్షిణానికి వచ్చేసరికి పడగొట్టిన 8 ప్రభుత్వాల వలె తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రిసార్ట్‌ బేరసారాలు నడిపించారు. దాన్ని కేసీఆర్‌ భగ్నం చేయడంతో పాటు, బీజేపీ వ్యవస్థాగత ప్రధాన కార్యదర్శి, వ్యూహకర్తను ఇరికించడంతో మోదీ-షాలు కక్కలేక మింగాల్సి వచ్చింది. దీంతో పాటు కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టిపెడుతానని ప్రకటించడం, పార్టీ పేరు మార్చడం, జలాలు, ప్రకృతి వనరులు, మానవ వనరుల గురించి మాట్లాడుతుండటం… ఢిల్లీ వెళ్లి రైతులకు, సైనికులకు ఆర్థికసాయం చేయడం వంటి చర్యలతోపాటు మహారాష్ట్రలో రాజకీయాలు చేయాలనుకోవడం వంటి చర్యలు చేపట్టడంతో వీటిని మొగ్గలోనే తుంచేయాలని బీజేపీ నిర్ణయించుకున్నది. కానీ, కేసులు పెట్టాలంటే పెద్దగా ఏవీ దొరకలేదు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితను ఇరికించి ఆమెను అరెస్టు చేశారు. అవన్నీ ఢిల్లీ ఎన్నికల తర్వాత హఠాత్తుగా మాయమైపోయాయి.

తెలంగాణ ఎన్నికలు వచ్చేసరికి తాము డైరెక్ట్‌గా గెలవడం సాధ్యం కాదని తేలడంతో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణాన్ని బీజేపీయే సృష్టించింది. దూకుడుగా వెళ్తున్న పార్టీ అధ్యక్షుడిని హఠాత్తుగా మార్చి, తన పార్టీకి ఉన్న సానుకూల వాతావరణాన్ని తానే తగ్గించుకుంది.

రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేసినప్పటికీ.. 2023లో ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో తెలంగాణలో తప్ప కాంగ్రెస్‌ ఎక్కడా గెలువలేదు. భారత్‌ జోడో యాత్ర ఏ మాత్రం ప్రభా వం చూపించలేదని క్లియరైంది. అవినీతి, ఈడీ, సీబీఐ లాంటివి ఏవీ కుదరకపోవడం తో.. కాంగ్రెస్‌ను దగ్గరుండి గెలిపించింది బీజే పీ. ఈ క్షణం వరకూ తెలంగాణలో కాంగ్రెస్‌కు బీజేపీ పెద్ద చైనా వాల్‌లా రక్షణగా నిలబడిందంటే అతిశయోక్తి కాదు. కాకపోతే.. కేసీఆర్‌ ఓడిపోయినప్పటికీ.. మళ్లీ ఎట్టి పరిస్థితుల్లో బలం పుంజుకోకుండా చేయడానికి రెండు పార్టీలు శాయశక్తులా పనిచేస్తున్నాయనడంలో సందేహం లేదు. అందులో భాగంగానే కాళేశ్వరాన్ని నిట్టనిలువునా కూలుస్తున్నారు. రోజుకొకరు ముందుకొచ్చి బీజేపీలో బీఆర్‌ఎస్‌ కలుస్తుందనే వరుస కథనాలు అల్లుతున్నారు. బీజేపీతో రాజీ పడేటట్టయితే 2023 ఎన్నికలకు ముందే రాజీ పడేవారు. ఎందుకంటే.. అప్పటికే లిక్కర్‌ స్కాం విచారణలో తన కూతు రు కవితను ఇరికించి తెలంగాణలో కేసీఆర్‌ను ఎట్లనైనా దింపాలనే తలంపుతో పనిచేస్తూ తన చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌కు సహకారమందించినా కేసీఆర్‌ లొంగలేదు. బీజేపీ, కాంగ్రెస్‌ విధానాలకు ప్రత్యామ్నాయంగానే నిలబడాలని ప్రాంతీయ పార్టీలను కూడగట్టే ప్రయ త్నం చేశారు. భారత్‌లో వనరులున్నాయని వాటిని సరైన రీతిలో ఉపయోగించుకుంటే ప్రపంచంలోనే మేటిగా భారత్‌ను నిలపవచ్చనే అభివృద్ధి వాదాన్ని ప్రతిపాదించి అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో జరిగిన అభివృద్ధిని నమూనాగా కేసీఆర్‌ చేసిచూపారు. కేసీఆర్‌ ఒక స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని నిర్మించి తన కల అయిన రాష్ర్టాన్ని సాధించి, వేగంగా ప్రపంచం తో పోటీ పడేలా రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నిలిపారు. అట్లాంటి కేసీఆర్‌ బీజేపీతో కలిసిపోతాడనుకోవడం మూర్ఖత్వమే. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎక్కడా తన ఆత్మైస్థెర్యాన్ని కోల్పోకుండా అద్భుతమైన రాజకీయ వ్యూహం తో ప్రత్యర్థులను చిత్తుచేసిన చరిత్ర కేసీఆర్‌ది.

తెలంగాణ ప్రజల హృదయాల్లో రాష్ట్ర సాధకునిగా, అభివృద్ధి ప్రదాతగా చెరగని ముద్రవేసిన కేసీఆర్‌ భారత రాజకీయాల్లో అరుదైన నాయకుడు. ‘జాతీయ రాజకీయాలు లేవు, రాష్ట్రం దాటి తాను బయటకురాను’ అని స్టాలిన్‌లాగా అనుకొని ఉంటే.. బీజేపీతో ఈ వార్‌ జోన్‌ క్రియే ట్‌ అయ్యేదే కాదు. అలా కాకపోవడం వల్లనే బీజేపీకి కేసీఆర్‌తో పాటు కేజ్రీవాల్‌, మమత వంటివారు టార్గెట్‌ అయ్యారు. ‘గోడకు వేలాడుతున్న తుపాకీ కూడా నిశబ్దంగానే ఉంటుది’ అని ఓ తెలంగాణ కవి అన్నట్టు కేసీఆర్‌ కూడా తన అద్భుత రాజకీయ చతురతతో ఏనాడైనా భారత రాజకీయాల్లో చక్రం తిప్పగల సాహస రాజకీయ నాయకుడు అనడం అతిశయోక్తి కాదు. ఎన్ని కుయుక్తులు, కుట్రలు పన్నినా, ఎంత విచ్ఛిన్నం చేయాలని చూసినా కేసీఆర్‌ ప్రజల మద్దతు కూడగట్టుకొని స్పార్టకస్‌లా వెయ్యి ఏనుగుల బలంతో తిరిగిరావడం ఖాయం.

(వ్యాసకర్త: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌)

డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్

Join WhatsApp

Join Now

Leave a Comment