*రాజకీయ నాయకులు తమ బంధువులే అని చెప్పుకుంటూ.. బిల్డర్ల ఇష్టారాజ్యం..*
*చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం..*
*అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టపడేనా..*
*స్పందించని జిల్లా అధికారులు..*
సంగారెడ్డి/పటాన్ చెరు, ఏప్రిల్ 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో జీ ప్లస్ టూ అనుమతులు తీసుకొని ఐదు, ఆరు అంతస్తులు నిర్మిస్తున్నా.. అధికారులు పూర్తిగా విఫలం చెందారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు చేస్తున్న వాటికి నోటీసులు ఇచ్చినా.. నిర్మాణాలు యథేచ్చగా సాగుతున్నాయి. అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చి నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంద్రేశం పరిధిలోని పీఎన్ఆర్, ఆర్కే, నవ్య కాలనీలలో అనుమతికి మించి అంతస్తుల నిర్మాణాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. జీ ప్లస్ టూ అనుమతులు తీసుకొని ఐదు, ఆరు అంతస్తుల వరకు నిర్మిస్తున్నా.. అధికారులు చర్యలు తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు ఘాటుగా విమర్శిస్తున్నారు. కొందరు బిల్డర్లుగా జీ ప్లస్ టు అనుమతులు పొంది మరో రెండు, మూడు అంతస్తులు అదనంగా నిర్మించి అమాయక ప్రజలకు అమ్మేస్తున్నారని పలువురు బాహాటంగానే పేర్కొంటున్నారు. అయితే ఈ విషయమై గ్రామస్తులు అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేస్తే.. అధికారులు అక్కడికి వెళ్లి నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలపై ఎక్కువ ఫిర్యాదులు అందితే ఏదో కూల్చి వేస్తున్నామన్న హడావిడి తప్ప పూర్తి స్థాయిలో కూల్చి వేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అన్ని కాలనీలలో ఇదే తరహాగా అక్రమ నిర్మాణాలు యథేచ్చగా జరుగుతున్నా.. అధికారులకు కనిపించడం లేదా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని సమాచారం. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు ఇస్తారే తప్ప కూల్చివేతలు చేయడానికి వెళ్తే కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడితో వెనక్కి తగ్గుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంద్రేశం పంచాయతీ పరిధిలో అనుమతికి మించి నిర్మించిన భవనాలు వందల సంఖ్యలో ఉన్నాయి. అయితే గతంలో పంచాయతీ అధికారులు అనుమతులు లేకుండా నిర్మించిన బహుళ అంతస్తులకు నోటీసులు ఇచ్చి.. తరువాత వాటి జోలికి వెళ్లడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి ఇంద్రేశంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై పంచాయతీ అధికారులను ఫోన్ లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు.
*బిల్డర్ల ఇష్టారాజ్యం..*
ఇంద్రేశంలో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్న బిల్డర్లు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొందరు బిల్డర్లు రాజకీయ నాయకులు, అధికారుల అండతో యథేచ్చగా నిర్మాణాలు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు నోటీసులు ఇవ్వగా.. బిల్డర్లు తమ పలుకుబడితో రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు కూల్చివేతలు చేయకుండా ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. విశేషమేమిటంటే కొందరు బిల్డర్లు రాజకీయ నాయకులు తమ బంధువులే అని చెప్పుకుంటూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి.