నిజామాబాద్, సెప్టెంబర్ 24 (ప్రశ్న ఆయుధం):
అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవాన్ని పురస్కరించుకుని డెఫ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “వ్యక్తుల మధ్య సంభాషణకు భాష అవసరం. అలాంటి భాష వినలేని, మాట్లాడలేని బధిరులకు సమాచారం అర్థమయ్యే రీతిలో అందించేందుకు సంకేత భాష ఏర్పడింది. బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికలు, చేతుల సంజ్ఞల ద్వారా భావ వ్యక్తీకరణ చేయడం ఓ గొప్ప నైపుణ్యం,” అని పేర్కొన్నారు.
2018 సెప్టెంబర్ 23న ఐక్యరాజ్యసమితి మొదటిసారిగా అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవాన్ని జరిపిందని తెలిపారు. ఈ సంవత్సరం (2025) దినోత్సవ థీమ్ – “సంజ్ఞా భాష హక్కులు లేకుండా మానవ హక్కులు లేవు” అని పేర్కొన్నారు. సంకేత భాషను ఉపయోగించే వారి హక్కులను గుర్తించకపోతే, బధిరుల పూర్తి హక్కులు సాధ్యం కాదని ఈ థీమ్ స్పష్టంగా సూచిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో సీడీపీఓ సౌందర్య, భూపతి, ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు.