ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి దక్కేనా! సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావుల మధ్య తీవ్ర పోటీ.
నిజామాబాద్ జనవరి16
సంక్రాంతి పండగ తర్వాత చేపట్టనున్న క్యాబినెట్ విస్తరణలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి దక్కనుoదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న మంత్రివర్గ విస్తరణ పై ఆశావాహులు ఎప్పుడు ఎప్పుడా అని నిరీక్షిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి మంత్రి పదవి కోసం విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ శాసనసభ్యులు, మాజీ మంత్రి పార్టీ సీనియర్ నాయకులు పి. సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి రేసులో ముందు వరుసలో ఉన్నారు. సుదర్శన్ రెడ్డి తో పాటు కామారెడ్డి జిల్లాకు చెందిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు మంత్రి పదవి కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఉమ్మడి జిల్లా మంత్రి పదవి పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమకున్న పరిచయాలతో హైకమాండ్ వద్ద బేరాసారాలు సాగిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారంతో వీరు తమ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు ప్రచారం పార్టీలో మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి నిజాంబాద్ జిల్లాకు ఏలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ప్రస్తుత మంత్రివర్గ విస్తరణలో మొత్తం ఆరుగురికి మంత్రి పదవి అవకాశం కల్పించనున్నారు. వీరిలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుండి పోటీ పడుతున్న ఇద్దరిలో ఎవరికి దక్కుతుందో నన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులు సుదర్శన్ రెడ్డికి ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నిజామాబాద్ జిల్లా నుండి టీ పీ సీ సీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ పార్టీలో కీలక పదవిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి వచ్చే అవకాశాలు తక్కువేనన్న ప్రచారం జరిగింది. పార్టీలో జరిగిన ఈ ప్రచారంతో కామారెడ్డి జిల్లాకు చెందిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు క్యాబినెట్ లో బెర్త్ ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి తనదైన శైలిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి ప్రాంతంలో జరిగిన పార్టీ పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశంలో టీ పీ సీ సీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పదవి పై స్పష్టంగా వెల్లడించారు. ఈ పార్లమెంటరీ సమీక్ష సమావేశంలోనే నిజామాబాద్ జిల్లాకు త్వరలోనే మంత్రి పదవి వస్తుందని స్పష్టంగా తేల్చి చెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలతో నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి వస్తుందన్న భరోసా కాంగ్రెస్ పార్టీలో ఏర్పడింది. అయితే ఉమ్మడి నిజామా బాద్ జిల్లాకా లేక కేవలం నిజామాబాద్ జిల్లా కేనా మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేయలేదు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను పరిగణలోకి తీసుకొని కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నుండి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మదన్ మోహన్ రావు కే మంత్రివర్గంలో ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. అదే స్థాయిలో సుదర్శన్ రెడ్డి సైతం మంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం.