జగన్ నియమించిన టిటిడి బోర్డులో తప్పు జరిగింది. ల్యాబ్ రిపోర్టులతో సహా విషయం బయటకు వచ్చినా… దబాయింపు చేయడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారింది. తప్పు జరిగినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటామని మాట్లాడాలి. లేదా అప్పటి బోర్డులో ఉన్న అధికారులు, బోర్డు సభ్యులు ప్రమేయం మీద మాట్లాడాలి. అంతేగాని ఇష్టానుసారం మాట్లాడడం మంచిది కాదు. ఇలాంటి సమయంలో ప్రాయశ్చిత్తం లేదా మౌనం మేలు. ఈ దేశంలో సెక్యులరిజం అనేది టూ వే గా ఉండాలి. సెక్యులరిజం కేవలం వన్ వే మాత్రం కాదు. ఇతర మతాల ఆచారాలకు, సంప్రదాయాలకు విఘాతం కలిగితే ఎలా స్పందిస్తున్నారో… హిందువుల మనోభావాలకు, ఆచారాలకు, సంప్రదాయాలకు, ధర్మాలకు విఘాతం కలిగినప్పుడు కూడా స్పందించాలి. సాటి హిందువులను తోటి హిందువులు తూలనాడడం మానుకోవాలి. హిందువులంతా- సనాతన ధర్మానికి ఏ మాత్రం విఘాతం కలిగినా కలిసికట్టుగా ముందుకు రావాలి. భవిష్యత్తు తరాలకు సనాతన ధర్మాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉంది.లడ్డు అపవిత్రం అయిందని మేము మాట్లాడితే హైకోర్టు ఏజీపీగా పని చేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి మదం ఎక్కిన మాట్లాడుతున్నారు. పంది కొవ్వు చాలా ఎక్కువ ధర ఉంటుందని దాన్ని సాధారణ నెయ్యిలో ఎలా కలుపుతారు అంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చాలా అవహేళన చేసి మాట్లాడుతున్నారు. ఆయన కూడా హిందువే. హిందూ ధర్మం పాటించే ప్రజలు ఎంత పవిత్రంగా భావించే లడ్డుకి అపచారం జరిగితే సాటి హిందువుగా ఇలాంటి మాటలు మాట్లాడడం దారుణం. భక్తుల మనోభావాలను మరింత దెబ్బ కొట్టేలా ఈ మాటలు ఉన్నాయి. సినీ నటుడు ప్రకాష్ రాజ్ నాకు మంచి మిత్రుడు. ఆయనపై ఎనలేని గౌరవం ఉంది. అయితే సనాతన ధర్మానికి, పవిత్రతకు భంగం కలిగినప్పుడు ఆ ధర్మాన్ని ఆచరించే వాళ్లు మాట్లాడడం కూడా తప్పే అన్నట్లు చెబితే ఎలా..? ఇదే తప్పు ఓ మసీదుకు లేదా చర్చికి జరిగితే ఇలాగే మాట్లాడతారా..? దేశంలో హిందువులకు ఏం జరిగినా సరే మాట్లాడే హక్కు లేదా..? మా హిందూ దేవతలను ఇష్టానుసారం వ్యంగ్యంగా మాట్లాడుతూ, వారిపై రకరకాల జోకులు వేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా.. మా మనోభావాలు దెబ్బ తిన్న నోరు మూసుకొని ఉండాలా… ఇదేనా మీరు చెబుతున్న సెక్యూలరిజం..? సినిమా ఇండస్ట్రీ వారిని కూడా నేను వేడుకుంటున్నాను. సనాతన ధర్మానికి సంబంధించిన విషయాల్లో ఇష్టానుసారం జోకులు వేయడం.. దాన్ని మీమ్స్ చేయడం సరికాదు. నిన్న ఓ సినిమా ఫంక్షన్ లో కూడా ఇలాగే జోకులు వేస్తున్నారు. సీరియస్ అంశాలను, ఎంతోమంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలను మాట్లాడే సమయంలో జాగ్రత్తగా మాట్లాడండి. వైవీ సుబ్బారెడ్డిని విచారణకు రమ్మంటే ఫైల్స్, రికార్డ్స్ అన్ని అడుగుతున్నారు. మీ హయాంలో తప్పు జరిగితే దానికి సంబంధించిన ఫైల్స్ మీకు ఇవ్వాలా..? మీ హయాంలో ఇలాగే ఇచ్చారా..? కరుణాకర్ రెడ్డి తిరుమలలో పెద్ద యాక్టింగ్ చేశారు. తిరుమలలో ఏదైనా అపచారం జరిగితే తమ కుటుంబాలు నాశనం అవుతాయని ఆయనే శపథం చేశారు. మీ నాశనం మొదలైంది.. మిగతాది పైన ఉన్న భగవంతుడే చూసుకుంటాడు.ఇంత పెద్ద అపచారం జరిగితే అప్పటి ఈవో ధర్మారెడ్డి గాయబ్ అయ్యారు. ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు. ఆయన హయాంలో తిరుమలను వ్యాపార, పర్యాటక కేంద్రంగా మార్చారు. ధర్మారెడ్డి కొడుకు చనిపోతే కనీసం 11 రోజులు కూడా ఆలయంలోకి వెళ్లకుండా ఉండలేకపోయారు. ఆగమశాస్త్రం పాటించే తిరుమలలో ఆయన ఇష్టానుసారం ప్రవర్తించారు. హిందువులకు కూడా చేతులెత్తి మొక్కుతున్నాను. బయటకు రండి. సనాతన ధర్మ రక్షణ కోసం తుది వరకు పోరాడుతాను అవసరమైతే ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధం. మనం పాటించే మత ధర్మానికి విఘాతం కలిగినప్పుడు కచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత మనపై ఉంది. సనాతన ధర్మాన్ని ఎంతో హుందాగా వచ్చే తరానికి అందించాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. మన మౌనం ధర్మ వినాశనానికి దారి కాకూడదు..