సీఎంలు మారారే గానీ.. పాలనలో ఎలాంటి మార్పు లేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
Donthi Mahesh
Oplus_131072
సంగారెడ్డి/మెదక్, ఫిబ్రవరి 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): సీఎంలు మారారే గానీ తెలంగాణ పాలనలో ఎలాంటి మార్పు లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ పట్టణంలో నిర్వహించిన ఓటర్ల సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్, బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్.వీ.ఎస్.ఎస్.ప్రభాకర్, బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్, మెదక్ జిల్లా ఇంచార్జ్ మురళి గౌడ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎంలు మారారే గానీ తెలంగాణ పాలనలో ఎలాంటి మార్పు లేదని, రాబోయే శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను మేధావులు గెలిపించి సత్తా చాటాలని సూచించారు. ఎన్నికల తర్వాత ప్రజా సమస్యలపై ఉద్యమ బాటలో పయనిస్తామని తెలిపారు. అనేక రాష్ట్రాల్లో మోదీ నేతృత్వంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధిలో దూసుకుపోతుందో చూస్తున్నారని అన్నారు. కర్ణాటక, హిమాచల్, తెలంగాణలో అవినీతి, అక్రమ ప్రభుత్వాల చేతకాని విధానాల వల్ల కనీసం జీతాలివ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన గ్యారెంటీలు, సబ్ గ్యారెంటీల మాట దేవుడెరుగు, కనీస హామీలను కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో 14 నెలలుగా తెలంగాణలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర దశ దిశను సూచించే ఎన్నికలని అన్నారు. మేధావులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, రైతులు, రైతు కూలీలు, మహిళలు, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమలులో చతికిలపడిందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి రూ. 4వేలు, మహిళలకు రూ.2500, ప్రతీ దళిత కుటుంబానికి రూ. 12లక్షలు, రైతులు, రైతు కూలీలకు ఆదుకుంటామన్న హామీలన్నీ నీటి మూటలుగానే మిగిలాయని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ హామీలిచ్చి.. ఇప్పుడు వారిని కనీసం కలవడం కూడా లేదని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చినవి, చేప్పినవన్నీ మోసపూరిత హామీలేనని, ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇంకేం లేవన్నది తేలిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాళా తీసిందని, ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఐదు డీఏలపై మాట్లాడే పరిస్థితి లేదన్నారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని, అదే దిశలో మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పాలన కొనసాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత హామీలు, అహాంకారపూరిత చర్యలు, అధికార దుర్వినియోగం తప్ప ఇరు ప్రభుత్వాల పాలనలో మార్పు ఏమీ లేదన్నారు. మార్పు వచ్చిందంటే కేవలం కేసీఆర్, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కుటుంబాల్లోనే వచ్చిందని విమర్శించారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఈ శాసన మండలి ఎన్నికల్లో ప్రజల తీర్పు కాంగ్రెస్ వైఫల్యానికి వ్యతిరేకంగా రానుందని, బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని, ఈ మార్పులో విద్యావంతులు, ఉపాధ్యాయులు, మేధావులు కీలక పాత్ర పోషించి మోదీ ప్రభుత్వాన్ని అక్కున చేర్చుకోవాలని భారీ మెజార్టీతో గెలిపించాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయంతో తమ పార్టీకి మరింత మద్ధతు లభిస్తుందని, దీంతో మరింత బలపడి ప్రభుత్వాల మెడలు వంచే ఉద్యమబాటలో పయనిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మోర్చా నాయకులు, మండల అధ్యక్షులు, బూత్ అధ్యక్షుడు, కార్యకర్తలు, ఎమ్మెల్సీ ఓటర్లు పాల్గొన్నారు.
To provide the best experiences, we use technologies like cookies to store and/or access device information. Consenting to these technologies will allow us to process data such as browsing behavior or unique IDs on this site. Not consenting or withdrawing consent, may adversely affect certain features and functions.