రాజకీయానికి బంధుత్వం లేదు!
“రాజకీయం అత్యంత క్రూరమైనది. కుటుంబాలను కూడా చీల్చేస్తుంది, తోబుట్టువుల్ని శుత్రవుల్ని చేస్తుంది”
ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అలాంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయి ?. కుటుంబంలో ఒకరే తాము పెత్తనం చేయాలని అనుకోవడం, ఇతరులకు న్యాయంగా ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం, కుటుంబపెద్ద కూడా నిస్సహాయంగా మారిపోయి.. న్యాయం చేయలేని పరిస్థితుల్లోనూ రాజకీయం అత్యంత క్రూరమైనది..కుటుంబాలను చీల్చేస్తోంది. అదే కుటుంబం అంతా ఒక మాట మీద ఉండి.. ఎవరి బాధ్యతలు, ఎవరి అధికారాలు.. ఎవరి ఆస్తులు వారి సవ్యంగా నిర్వహించుకుంటే సమస్యలు రావు. ఎక్కడైనా తమపై వివక్ష చూపిస్తున్నారని ఇతరులు అనుకుంటారో అప్పుడే రాజకీయం పెనుభూతంగా మారడం ప్రారంభమవుతుంది. చివరికి అది కుటుంబాలను చీల్చేస్తుంది. తోబుట్టువుల మధ్య శత్రుత్వాన్ని పెంచుకుంది. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో అదే జరుగుతోంది. రెండు రాజకీయ కుటుంబాలు చీలికలు, పేలికలు అయి తాము సృష్టించిన రాజకీయ వ్యూహాల్లోనే నలిగిపోతున్నారు.
రెండు ప్రాంతీయ పార్టీల కుటుంబాల్లో చిచ్చు
ఇప్పుడు అంతా కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న రాజకీయం గురించే చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తున్న కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆ కుటుంబం రెండుగా చీలిపోయినట్లు అయింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని పెట్టిన దగ్గర నుంచి పదేళ్ల పాటు నిరాటంకంగా తెలంగాణను పరిపాలిన వరకూ కేసీఆర్ మాటకు ఎదురు లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఆయన కళ్ల ముందే కుటుంబం చీలిపోయింది. నాకు న్యాయమేదీ నాన్నా అని కవిత దీనంగా అడుగుతూంటే కేసీఆర్ ఏమీ చెప్పలేకపోతున్నారు. అలా అడిగినందుకు కవితను సస్పెండ్ చేయాల్సి వచ్చింది. కవిత పార్టీని ధిక్కరించినందుకు హరీష్ రావు, సంతోష్ రావులపై ఆరోపణలు చేసినందుకు సస్పెండ్ చేశారు. కానీ ఆమె అలా ఎందుకు చెప్పాల్సిన వచ్చింది ?. తనను దారుణంగా అవమానించి రాజకీయంగా నష్టం చేసి.. పూర్తిగా ఇంటికే పరిమితం చేసే కుట్రలు జరిగాయి కాబట్టే ఆమె బయటకు వచ్చి చెప్పాల్సిన వచ్చింది. నిజంగా కవితను రాజకీయాల నుంచి విరమించుకోవాలని చెప్పాలని అనుకుంటే కేసీఆర్ చెప్పలేరా ?. చెప్పలేకపోతే ఖచ్చితంగా ఆయన పార్టీపై, కుటుంబంపై పట్టు కోల్పోయినట్లే అవుతుంది. ఇప్పుడు అదే జరిగింది. కవిత రాజకీయ ఆకాంక్షలు, కవితను వద్దనే ఇతరుల మధ్య ఆయన నలిగిపోయారు. ఎవరికీ సర్ది చెప్పలేకపోయారు. కానీ కవితను మాత్రం సమర్థించలేకపోయారు.
ఫలితంగా కవిత తన దారి తాను చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికి తగ్గ పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. ఇది ఆరంభం మాత్రమే. కానీ కవిత పేల్చింది డైనమేట్. బీఆర్ఎస్ పార్టీలో ఎంత మేర పగుళ్లు వచ్చాయో అంచనా వేయడం కష్టం. హరీష్ రావు, సంతోష్ రావుపై ఇప్పటి వరకూ పార్టీలో ఉన్న అంతర్గత అసంతృప్తి బయటకు వచ్చింది. కవితతో వెళ్లకపోయినా చాలా మంది ఈ ఇద్దరి నేతలపై నమ్మకం ఉంచుకునే అవకాశం ఉండదు. ఎలా చూసినా వీరిద్దరు ఇప్పుడు అగ్నిపరీక్షను ఎదుర్కొంటారు. ఎలాంటిదంటే.. ఏం చేసినా కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారా అన్న అనుమానాలు వచ్చేలా శల్యపరీక్ష జరుగుతుంది. దాన్ని వారు తట్టుకోవడం అంత తేలిక కాదు.
కవిత నిర్ణయానికి కారణం వివక్ష
కవిత ఇంతటి నిర్ణయం తీసుకోవడానికి కారణం కుటుంబంలో.. పార్టీలో ఆమెపై జరిగిన వివక్ష. తనకు జరిగిన అవమానాలను చెప్పుకోలేనని కవిత అన్నారు. కచ్చితంగా ఇలాంటి వివక్షే తెగదెంపులకు కారణం అవుతుంది. కల్వకుంట్ల కుటుంబంలో అదే జరిగింది. ఇలాంటివి జరగకపోతే.. అంతా సాఫీగా సాగిపోతుంది. కుటుంబ పెద్ద కొంత మందికి ప్రాధాన్యత ఇచ్చి.. మరికొంత మందికి తక్కువ ప్రాధాన్యత ఇస్తే .. తక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వారికి ఎక్కువ కోపం వస్తుంది. సొంత తండ్రిని కలవడానికి వేరే వాళ్లు ఆంక్షలు పెడితే కవితకు ఎలా ఉంటుంది?. తన తండ్రి తనను కాకుండా తనపై కుట్రలు చేశారని అనుమానిస్తున్న వారిని ప్రోత్సహిస్తూంటే ఏ కుమార్తెకైనా ఎలా ఉంటుంది..?. కవితకూ అదే అసంతృప్తి . అందుకే తిరుగుబాటు ప్రకటించారు. ఆమె పార్టీ పెడతారా.. వేరే పార్టీలో చేరుతారా అన్న సంగతి తర్వాత కానీ.. రాజకీయం వల్లనే ఆమెను కుటుంబం దూరం పెట్టింది.. కుటుంబాన్ని ఆమె దూరం చేసుకుంది. ఒక్క సారి సొంత రాజకీయం ప్రారంభిస్తే.. ఇక ఏ హద్దులూ ఉండవు. ఖచ్చితంగా ఇదే పరిస్థితి మరో పవర్ ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీగా భావించి వైఎస్ కుటుంబంలో ఇంతకు ముందు జరిగింది. ఇక్కడ కూడా.. వివక్ష, అన్యాయం చేయడం వల్లనే ఆ కుటుంబం చీలిపోయింది. కుటుంబ పెద్ద, నాయకుడు స్వార్థపూరితంగా వ్యవహరించడం వల్లే వైఎస్ కుటుంబం చీలిక పేలికలు అయింది. అయితే ఇక్కడ కూడా అంతర్గతంగా రాజకీయానిదే కీలక పాత్ర. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు… వైఎస్ కుటుంబం ఏకతాటిపైన ఉండేది. మొత్తం అయనే డిసైడ్ చేసేవారు. ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఎవరురాజకీయాల్లో ఉండాలి.. ఎవరు తెర వెనుక ఉండాలన్నది ఆయన నిర్ణయం. ఖచ్చితంగా పాటించాల్సిందే. అయితే ఇచ్చే పాత్రల్లో అందర్నీ సంతృప్తి పరిచేవారు. అందుకే అందరూ ఆహా..ఒహో అనేవారు. ఆయన తదనంతరం.. ఆయన కుమారుడు జగన్ రెడ్డి కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. కానీ వైఎస్ చూపించిన నాయకత్వ లక్షణాల్లో, కుటుంబ పెద్ద బాధ్యతల్లో ఒక్కటంటే ఒక్క శాతం కూడా చూపించలేదు. పైగా అత్యంత స్వార్థపూరిత మనస్థత్వాన్ని చూపించారు. ఫలితంగా ఇప్పుడు వైఎస్ కుటుంబ చిన్నాభిన్నమైపోయింది. చివరికి హత్యలు కూడా చేసుకున్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని సమీప బంధువులే అత్యంత కిరాతకంగా చంపేసి.. ఆయన కుమార్తె రాకుండానే అంత్యక్రియలు చేసేయాలని చూసి దొరికిపోయారు. ఆ కేసులు ఏమయ్యాయన్న సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడి కత్తులు దూసుకుంటోంది.
వైఎస్ కుటుంబాన్ని చింపిన విస్తరి చేసిన జగన్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన రోజు అని జగన్.. నివాళి అర్పించడానికి పులివెందులకు వెళ్లారు. అక్కడ ఆయన తల్లిని ఏ మాత్రం ఆదరించని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసి రాజకీయం ఇంత రాక్షసంగా ఉంటుందా అని అనుకున్నారు. ఎందుకంటే తల్లిని రాజకీయాల్లోకి తెచ్చింది జగన్. తండ్రి చనిపోవడంతో ఆ సానుభూతిని గరిష్టంగా వాడుకోవడానికి తల్లిని గౌరవాధ్యక్షురాలిగా పార్టీని పెట్టారు. ఆమెను ఎమ్మెల్యేను చేసి అసెంబ్లీలో నానా మాటలనిపించారు. తర్వాత గెలిచే చాన్స్ లేని విశాఖ నుంచి పోటీ చేయించి పడిపోయేలా చేశారు. నిజంగా తల్లిని పార్లమెంట్ కు పంపాలని అనుకుంటే కడప నుంచే పోటీ చేయించేవారు. కానీ ఆ సీటును అవినాష్ రెడ్డికి ఇచ్చి విజయమ్మను ఓడిపోయే సీటులో నిలబెట్టారు. ఆ తర్వాత చెల్లి షర్మిలను వదిలి పెట్టలేదు. నిజానికి షర్మిల రాజకీయ ప్రాధాన్యం కోరుకోలేదు. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఆస్తులను మాత్రమే పంచమని కోరారు. కానీ అక్కడ ధన దాహంతో జగన్ మోసం చేయడంతో షర్మిలకు మరో దారి లేక రాజకీయాల్లోకి వచ్చారు. దిగిన తర్వాత ఇక చలి ఎందుకని ఏపీలోకి వచ్చేశారు. కుమారుడు చేసిన అవమానాలను తట్టుకోలేని విజయమ్మ ఇప్పుడు కుమార్తె వద్దనే ఉంటున్నారు. వారు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి .. గతంలో రాసిచ్చిన ఆస్తుల్ని కూడా ఎన్సీఎల్టీకి వెళ్లి మళ్లీ తనకే వచ్చేలా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆస్తుల్ని లాగేసుకున్నందుకు ఆయన పార్టీ చేసుకున్నారు. అలాంటి వ్యక్తి కుటుంబ పెద్దగా ఉంటే.. రాజకీయం ఇంకా ఎంత రాక్షసంగా మారుతుందో చెప్పాల్సిన పని లేదు. విజయమ్మ, షర్మిలకు ఎదురైన అనుభవాలే సాక్ష్యాలు ఉంటాయి.
షర్మిల , కవిత వివక్షపై పోరాటం !
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ రెండు పవర్ ఫుల్ ఫ్యామిలీల్లో మహిళా కుటుంబసభ్యులపై చూపించిన వివక్ష కారణంగానే రాజకీయాలు మలుపులు తిప్పాయి. అటు షర్మిల .. ఇటు కవిత ఇద్దరితో చాలా మంది పోలికలు పెట్టి చూస్తున్నారు. ఇద్దరు ఎదుర్కొన్న వివక్షలు సమానమే. ఇద్దరూ సొంత రాజకీయాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో.. ఇంకా చాలా సిమిలారిటీస్ వెతికి చెబుతున్నారు నెటిజన్లు. ఇద్దరి భర్తల పేర్లు యాధృచ్చికంగా అనిల్ కుమార్ . అదే సమయంలో ఇద్దరూ చెబుతున్న కారణాలు కూడా ఒకటే. తమ పార్టీ అధినేత ఇతరుల చేతుల్లో బందీ అయ్యారని అంటున్నారు. కేసీఆర్ ..హరీష్, సంతోష్ రావు వంటి వారి చేతుల్లో బందీ అయ్యారని.. జగన్ మోహన్ రెడ్డి తన భార్య భారతీరెడ్డి, ఆమె బంధువుల చేతుల్లో బందీలయ్యారని అందుకే తో రక్తసంబంధీకులకు అన్యాయం చేస్తున్నారని అంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో కానీ.. ఇద్దరి పై కుటుంబాల్లో, రాజకీయాల్లో చూపించిన వివక్ష మాత్రమే ఈ పరిణామాలకు కారణం.
స్వార్థపూరిత నాయకత్వాలతో పార్టీలు మనుగడ సాగించలేవు !
రాజకీయాల్లో ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్ చాలా ముఖ్యం. ప్రాంతీయ పార్టీలు అంటే.. సహజంగానే కుటుంబ పార్టీలు, వ్యక్తి ఆకర్షణ మీద నడిచే పార్టీలు. ఆ పార్టీల్లో పెద్ద ఎప్పుడూ వివక్ష చూపించకూడదు.. కనీసం చూపించనట్లుగా నమ్మించాలి. ఎవరి సామర్థ్యం మేరకు వారిని ప్రోత్సహించాలి. అంతేకానీ ఒకరికి అన్యాయం జరుగుతుందనే భావన ఎవరికైనా వస్తే.. అది రాచపుండుగా మారుతుంది. కలసి మెలిసి ఉన్న కుటుంబాలు ఇలా విడిపోయిన ఘటనలు.. కేవలం కేసీఆర్, వైఎస్ కుటుంబాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా చాలా కుటుంబాల్లో ఉన్నాయి. బీజేపీలో తిరుగులేని నేతగా ఎదుగుతారని అనుకున్న ప్రమోద్ మహాజన్‌ను ఆయన సోదరుడే కాల్చి చంపేశారు. చరిత్రలోకి చూస్తే.. గాంధీ కుటుంబంలో … సంజయ్ గాంధీ కుటుంబం ఇప్పటికీ వేరే పార్టీలో ఉంది. శరద్ పవార్ కుటుంబం కూడా చీలిపోయింది. ఇలాంటి ఉదాహరణలు మన దేశ రాజకీయాల్లో చాలా కనిపిస్తాయి. అందుకే రాజకీయానికి బంధుత్వం ఉండదు. కుటుంబంలో చిచ్చు రేగకుండా చూసుకోవాల్సిన బాధ్యత.. ఆ పార్టీ .. కుటుంబ పెద్దలదే. ఆ బాధ్యతలో వారు ఏ మాత్రం విఫలమైనా.. క్రాక్ మొదట్లో చిన్నగానే ఉంటుంది. కానీ రాను రాను అది.. కాళేశ్వరం బ్యారేజీకి పడినంత పెద్దది అవుతుంది. అప్పుడు రిపేర్ కూడా సాధ్యం కాదు. బ్యారేజీ మొత్తం కూల్చేసి మళ్లీ కట్టుకోవాల్సి వస్తుంది. కానీ కుటుంబాల్లో అలాంటి చాన్స్ ఉండదు. కుటుంబాలు కూలిపోయే మళ్లీ కట్టుకునే ఆప్షన్ ఉండదు. అందుకే రాజకీయనేతలు.. ముఖ్యంగా కుటుంబాలను .. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై నడిపించాల్సిన వారు.. ఎంతో తెలివిగా నిర్వహించాల్సి ఉంటుంది. లేకపోతే సర్వం కోల్పోతారు.. మానసిక శాంతితో సహా. ఇప్పుడు అదే కళ్ల ముందు కనిపిస్తోంది.