జిల్లాలో యూరియా కొరత లేదు యూరియా పక్కదారి పట్టకుండా చూడాలి

సరైన ఆధారాలు లేకుండా యూరియా సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు1 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూరియా కొరత లేదని,రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు.శుక్రవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో వ్యవసాయ, సహకార శాఖ మరియు సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లాలో యూరియా నిల్వలు, సరఫరా,వినియోగ పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,జిల్లాలో తగినంత యూరియా నిల్వలు ఉన్నాయని, పంటల సాగుకు అవసరమైనంత సరఫరా చేయడానికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రైతులు అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేయడం వల్ల కృత్రిమంగా డిమాండ్ పెరిగినట్టు కనిపిస్తోందని,దీని వల్ల అయోమయ పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివరించారు.యూరియాను పంటల సాగుకు కాకుండా ఇతర అవసరాల కోసం మళ్లించరాదని, అలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.యూరియా సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని,ఏ ఒక్కరు కూడా దుర్వినియోగానికి పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. యూరియా పంపిణీ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని,ప్రతి సప్లై ఆధార్ నెంబర్ ఆధారంగా నమోదు కావాలని కలెక్టర్ సూచించారు. ఆధారాలు లేకుండా యూరియా సరఫరా చేసిన అధికారులపై తగిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు అవసరమైనంత మేరకు మాత్రమే యూరియా ఇవ్వాలని, నిల్వలు నిరంతరం తనిఖీ చేస్తూ సంబంధిత నివేదికలు సమర్పించాలని సూచించారు.
రైతులు యూరియాకు బదులుగా నానో యూరియా ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు నానో యూరియా వినియోగం వల్ల ఖర్చు తగ్గుతుందని,నేల ఫలవంతత పెరుగుతుందని, పర్యావరణానికి హానికరం కలగదని చెప్పారు. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.గ్రామస్థాయిలో రైతు వేదికలు,ఫీల్డ్ డెమోల్లో నానో యూరియా ప్రయోజనాలను వివరించాలని, నానో యూరియా వినియోగాన్ని పెంపొందించాలన్నారు.
ఈ సీజన్‌లో 1000 ఎకరాల మునగ సాగు లక్ష్యంగా పెట్టుకోవాలని, ఈ పంట ద్వారా రైతులకు తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం లభిస్తుందన్నారు.మునగ సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టాలన్నారు.
అజోల్ల పెంపకం,బయోచార్ తయారీ వంటి పర్యావరణహిత చర్యలు రైతులకు విస్తృతంగా పరిచయం చేయాలని,ఇవి పంటల ఉత్పాదకత పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ తెలిపారు. అజోల్ల వల్ల పశుగ్రాస సమస్యకు పరిష్కారం దొరకడమే కాకుండా, మట్టిలో మైక్రోబయాలజికల్ జీవ క్రియలు మెరుగవుతాయని వివరించారు. బయోచార్ వాడకం వల్ల నేలలో తేమ నిల్వ పెరిగి,దిగుబడి పెరుగుతుందని వెల్లడించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, డీఎస్ఓ అవధాని శ్రీనివాసరావు, డిపిడి ఆత్మ బి.సరిత,మార్క్ఫెడ్ డిఎం సునీత,సొసైటీ సీఈఓలు, వ్యవసాయ శాఖ ఏ డి ఏ లు, ఏవోలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment