సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వ్యవసాయ అవసరాలకు తగినంతగా యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 800 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉన్నందున రైతులు ఎరువుల కొరత గురించి ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా విక్రయం పూర్తిగా ఎంఆర్పీ ధరలకే జరగాలి. దానికంటే ఎక్కువ ధరకు విక్రయించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఎరువులు అందుబాటులో పారదర్శకంగా చేరేలా ఆధార్ కార్డు ఆధారంగా విక్రయ విధానం అమలులో ఉన్నదని, అన్ని విక్రయ కేంద్రాలు ఈఓపి మిషన్ల ద్వారా విక్రయించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే ప్రతి విక్రయ కేంద్రం స్టాక్ రిజిస్టర్‌ను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉందని, ఎరువుల సరఫరాలో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకున్నా వెంటనే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, ప్రతి రైతు తనకు అవసరమైన యూరియా యూనిట్లు అందుకునేలా ఏర్పాట్లు చేస్తోందని ఆయన అన్నారు. సాగు సీజన్‌లో రైతులు ఎరువుల కొరత వల్ల ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికతో సరఫరా కొనసాగుతుందని శివప్రసాద్ స్పష్టం చేశారు.రైతులు ఎరువుల విషయంలో అపోహలు నమ్మకుండా, ప్రభుత్వ గుర్తింపు పొందిన సేల్స్ పాయింట్ల నుంచే కొనుగోలు చేయాలని, యూరియా నిలువలు స్టాక్ బోర్డుపై ప్రదర్శించాలని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఎరువుల లభ్యత సమృద్ధిగా ఉందని, రైతులు నిస్సంకోచంగా సాగు పనులు కొనసాగించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ పేర్కొన్నారు.
జిల్లాలో యూరియా కొరత లేదు: వ్యవసాయ జిల్లా అధికారి శివప్రసాద్
Oplus_131072