*నన్ను దాడి నుంచి కాపాడింది తిరుమలేశుడే*
– చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్
తిరుమల: తనపై ఫిబ్రవరి 7న జరిగిన భయంకరమైన దాడి నుంచి శ్రీవారే తనను కాపాడారని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ అన్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ దాడి తర్వాత కలియుగ వైకుంఠం తిరుమలను సందర్శించాలని తన మనసులో కోరిక కలిగిందన్నారు. ఈ క్రమంలో స్వామి పాదపద్మాలకు నమస్కరించుకోవాలని తిరుమలకు వచ్చానని చెప్పారు.
కాగా, స్వామికి భక్తులు సమర్పించే కానుకలను రోడ్ల నిర్మాణాలు వంటి వాటికి కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మపరిరక్షణ, వేదధర్మ ప్రతిష్ఠకు వినియోగించేలా టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులు జాగ్రత్తలు పాటించాలని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. అక్కడక్కడా ఉండే దేవాలయాల్లో నిత్య కైంకర్యాలకు అవసరమైన నిధులను సమకూర్చే బాధ్యతను టీటీడీ స్వీకరించాలని కోరారు. తిరుమలలో బ్రహ్మాండమైన ఏర్పాట్లు కనిపిస్తున్నాయని, ఇవి ఇలానే కొనసాగాలన్నారు..