సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాకు రావడం ఇదే తొలిసారి…!

మెదక్ : మెదక్‌ చర్చి శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హాజరవుతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాకు రావడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 10.45 గంటలకు హెలికాప్టర్‌లో మెదక్‌ జిల్లాకు బయలుదేరుతారు. కొల్చారం మండలం పోతంశెట్‌పల్లి శివారులోని టేకులగడ్డ వద్ద నిర్మించిన హెలిప్యాడ్‌ వద్ద దిగి ఏడుపాయల వనదుర్గమాత ఆలయానికి చేరుకొని పూజల్లో పాల్గొంటారు. అక్కడే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మెదక్‌లోని చర్చికి చేరుకొని క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొంటారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12.25 గంటలకు సీఎం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు.

*రూ.600 కోట్లకు పైగా అభివృద్ధి పనులు*

మెదక్‌ నియోజకవర్గంలో రూ.600 కోట్ల అభివృద్ధి పనులకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు తెలిపారు. మెదక్‌లో వైద్య కళాశాల భవనానికి రూ.250 కోట్లు, నర్సింగ్, పారా మెడికల్‌ కళాశాలలకు రూ.210 కోట్లు, చర్చిలో అభివృద్ధి పనులకు రూ.29 కోట్లు, ఏడుపాయలలో రూ.35 కోట్లతో సెంట్రల్‌ లైటింగ్, తండాల్లో రహదారులకు రూ.45 కోట్లు, ఇతర రహదారులకు రూ.7 కోట్లు, మెదక్‌లో మహిళా శక్తి భవన్‌కు రూ.5 కోట్లు, సమీకృత గురుకుల పాఠశాలకు రూ.30 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్‌ లింకేజికి రూ.100 కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.

*ఏర్పాట్లు పరిశీలించిన ఐజీ*

ఏర్పాట్లను మల్టీజోన్‌-1 ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి మంగళవారం పరిశీలించారు. మెదక్‌ చర్చి, ఏడుపాయల ఆలయ పరిసరాలు, హెలిప్యాడ్‌ వద్ద ఏర్పాట్లు పరిశీలించి, బందోబస్తు, భద్రత వివరాలు ఆరా తీశారు. జిల్లా ఎస్పీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, మెదక్‌ గ్రామీణ సీఐ రాజశేఖర్‌ రెడ్డి, తదితరులున్నారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ తెలిపారు. హెలిప్యాడ్, ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ నగేష్, డీఆర్డీవో శ్రీనివాసరావు, ఆర్డీవో రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్‌ ఉన్నారు.

 

Join WhatsApp

Join Now