*హైదరాబాద్ తాగునీటికి మూడు ప్రత్యామ్నాయాలు..!!*
కోండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్, సంగారెడ్డి కాలువ నుంచి నీటి మళ్లింపుపై ప్రతిపాదనలుగోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడూ సమస్య రావొద్దని యోచిస్తున్న ప్రభుత్వం మల్లన్నసాగర్ నుంచే మేలని భావిస్తున్న నీటిపారుదల శాఖ వర్గాలు
హైదరాబాద్ తాగునీటి అవసరాలతో పాటు మూసీ పునరుజ్జీవంలో భాగంగా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు గోదావరి నీటిని మళ్లించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. మూడు ప్రత్యామ్నాయాలపై కసరత్తు చేస్తోంది. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి సమస్య లేకుండా తాగునీరు సరఫరా చేయగలగడం, భూసేకరణ తక్కువగా ఉండటం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోనుంది.
కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్, సంగారెడ్డి కాలువ నుంచి రావల్‌కోల్ వద్ద నీటిని మళ్లించే ప్రతిపాదనలపై అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకోనుంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద ఈ అంశంపై పురపాలక, నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం జరిగింది. మూడు ప్రతిపాదనలను పరిశీలించి.. వాటిలో ఏది మెరుగైంది, ఎప్పుడూ ఎలాంటి సమస్య లేకుండా తాగునీటిని తీసుకోవడానికి ఎందులో అవకాశం ఉంటుంది తదితర అంశాలపై అధ్యయనం చేసి తుది నిర్ణయానికి రావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ నేపథ్యంలో రెండు శాఖలు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నాయి. గోదావరి నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీల కేటాయింపు ఉండగా, మొదటి దశలో ఎల్లంపల్లి నుంచి పది టీఎంసీలు తీసుకొంటున్నారు. రెండో దశ కింద హైదరాబాద్ తాగునీటి అవసరాలకు పది టీఎంసీలు, మూసీ పునరుజ్జీవం కోసం ఐదు టీఎంసీలు కలిపి 15 టీఎంసీలు తీసుకోవాలని ప్రతిపాదించారు. తాజాగా 20 టీఎంసీలను మళ్లించాలని ఆలోచిస్తున్నారు. కొండపోచమ్మసాగర్ నుంచి నీటిని తీసుకొంటే.. మల్లన్నసాగర్ నుంచి తీసుకొనే దానికి సంవత్సరానికి అయ్యే నిర్వహణ వ్యయం కన్నా రూ.50 కోట్లు ఎక్కువ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మల్లన్నసాగర్ సామర్థ్యం ఎక్కువ కావడం, డెడ్ స్టోరేజీలోనే ఐదు టీఎంసీలు అందుబాటులో ఉండటం, ఈ నీటిని తాగునీటికి మాత్రమే వినియోగించడానికి వీలవుతుంది కాబట్టి ఏడాది పొడవునా ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. అయితే మూడు ప్రతిపాదనలను బేరీజు వేసి తుది నిర్ణయానికి రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
*కొండపోచమ్మ నుంచి..*
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మసాగర్ నుంచి పది టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మళ్లించేందుకు 2017 అక్టోబరు 24న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. కేశవాపురం వద్ద పది టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించడం, కొండపోచమ్మసాగర్ నుంచి కేశవాపురానికి ఐదు టీఎంసీలు, నేరుగా ఘనపూర్ వద్ద మరో ఐదు టీఎంసీలు మళ్లించడం, రెండు నీటి శుద్ధీకరణ ప్లాంట్లు ఏర్పాటు చేయడం.. దీని లక్ష్యం. ఈ పని విలువను రూ.4,777.59 కోట్లుగా అంచనా వేసింది. ఈ పనిని హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించింది. దీని ప్రకారం పదేళ్లలో చెల్లించాల్సిన మొత్తం రూ.7,212.78 కోట్లుగా ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇందులో అంచనా వ్యయంలో 20 శాతం, భూసేకరణ వ్యయం కలిపి ప్రభుత్వ వాటా రూ.1,260.67 కోట్లు కాగా, నిర్మాణం చేపట్టే సంస్థ మిగిలిన 80 శాతం కింద రూ.3,516.92 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. టెండర్లలో అంచనాపై 3.45 శాతం ఎక్కువ కోట్ చేసి ఎల్-1గా నిలిచిన ఎం.ఇ.ఐ.ఎల్.కు పనిని అప్పగిస్తూ 2018 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జులై 8న అప్పటి ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో భూసేకరణ సమస్యను పరిగణనలోకి తీసుకొని ఐదు టీఎంసీల సామర్థ్యంతో కేశవాపురం రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించారు. ప్రభుత్వ, అటవీ భూమిలో 5.04 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను రూ.3,363.37 కోట్లతో నిర్మించడంతోపాటు కొండపోచమ్మ నుంచి ఘనపూర్‌కు పది టీఎంసీల మళ్లింపు పనిని ఎం.ఇ.ఐ.ఎల్‌కు అప్పగించింది.
ఈ పనిని అప్పటికే చేస్తున్న సంస్థకు అప్పగించడానికి నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. అయితే భూసేకరణ సమస్య వల్ల రిజర్వాయర్ నిర్మాణం, ఇతర పనులు చేపట్టలేదు. అందువల్ల తాజా ఎస్.ఎస్.ఆర్. ప్రకారం రూ.1,050 కోట్లు అదనంగా చెల్లించాలని నిర్మాణ సంస్థ కోరింది. దీంతో ప్రస్తుత ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. కొండపోచమ్మసాగర్ కింద ఉన్న ఆయకట్టుకు అందించేందుకు, హైదరాబాద్ తాగునీటికి 20 టీఎంసీలు తీసుకోవాలంటే మొత్తం 48 టీఎంసీలు అవసరమని అంచనా. దీంతోపాటు డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తీసుకొనే సదుపాయం లేదని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ పని చేపట్టాలంటే 1,615 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఈ పథకం ఘనపూర్ వరకే ఉన్నందువల్ల మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఉస్మాన్‌సాగర్, హిమయత్‌సాగర్‌లకు మళ్లించడానికి అయ్యే ఖర్చు అదనం. కొండపోచమ్మసాగర్ నుంచి ఐదు దశల్లో ఎత్తిపోతల ఉందని, నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుందని నీటిపారుదల శాఖ ఎత్తిపోతల సలహాదారు నివేదించినట్లు తెలిసింది. తాజాగా దీన్ని రూ.5,869.22 కోట్లుగా అంచనా వేశారు. దీంతో పాటు ఘనపూర్ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు, ఉస్మాన్‌సాగర్ నుంచి హిమాయత్‌సాగర్‌కు పైపులైన్ వేసి నీటిని మళ్లించాల్సి ఉంటుంది. అయితే గతంలో ఇచ్చినట్లుగా యాన్యుటీ పద్ధతిని పక్కనపెట్టి రెగ్యులర్ టెండర్ ప్రకారం అప్పగించినా రూ.5,495 కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు తెలిసింది.
*మల్లన్నసాగర్ నుంచి..*
మల్లన్నసాగర్ సామర్థ్యం 50 టీఎంసీలు కావడంతో పాటు డెడ్ స్టోరేజీ నుంచి కూడా తాగునీటి అవసరాలకు తీసుకొనే వెసులుబాటు ఉన్నందువల్ల ఏడాది పొడవునా ఎలాంటి సమస్య ఉండదని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఉన్న గోదావరి పైపులైన్‌కు సమాంతరంగా కొత్త పైపులైన్ వేయాల్సి వస్తుందని, దీనికి అవసరమైన భూసేకరణ గతంలోనే జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో రెండు దశల్లో ఎత్తిపోతలు ఉన్నందువల్ల కొండపోచమ్మసాగర్ కంటే ఏడాది నిర్వహణ వ్యయం రూ.50 కోట్ల వరకు తగ్గుతుందని అంచనా. మల్లన్నసాగర్ నుంచి ఘనపూర్‌కు, ఘనపూర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లకు నీటిని మళ్లించడానికి రూ.5,560 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వు కూడా జారీ చేసింది. అయితే ఇది 15 టీఎంసీలకు మాత్రమే. మరో ఐదు టీఎంసీలు కలిపి మొత్తం 20 టీఎంసీలు తీసుకోవాలంటే అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
*రావల్‌కోల్ నుంచి..*
సంగారెడ్డి కాలువ 27వ కి.మీ వద్ద నుంచి 15 టీఎంసీల నీటిని మళ్లించడం, రావల్‌కోల్ వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించడం, ఇక్కడి నుంచి ఘనపూర్‌కు, తర్వాత హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు మళ్లించే ప్రతిపాదనను కూడా తాజాగా పురపాలక, నీటిపారుదల శాఖలు పరిశీలించాయి. ఇటీవల ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో ఈఎన్సీ అనిల్‌కుమార్ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. ఈ పనికి సుమారు రూ.ఐదు వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. అయితే సంగారెడ్డి కాలువ 27వ కి.మీ.కి ముందే సాగుకు నీటిని తీసుకొనే తూములు ఎక్కువగా ఉన్నాయి. కాలువ, తూముల నిర్వహణ సమస్యగా మారే అవకాశం ఉండటంతో పాటు తీసుకొన్న నీటిలో 40 శాతానికి మించి తాగునీటికి మళ్లించడం కష్టమని అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఈ మూడింటిపై మరింత లోతుగా కసరత్తు చేసి నిర్మాణ వ్యయంలో కొంత తేడా ఉన్నా, తాగునీటికి నూరు శాతం ఇబ్బంది లేని పథకం వైపు మొగ్గు చూపాలన్న ఆలోచనతో నీటిపారుదల, పురపాలక శాఖలు ఉన్నట్లు తెలుస్తోంది.