Site icon PRASHNA AYUDHAM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

medak road accident

మెదక్ జనవరి 3 (ప్రశ్న ఆయుధం న్యూస్) : మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మేడాలమ్మ దేవాలయం సమీపంలో చోటుచేసుకుంది. మెదక్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న రెండు ఆటోలను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ప్రమాదంలో ముందున్న ఆటోలో ప్రయాణిస్తున్న దూది ఐశ్వర్య, పాపగారి మనిషా, సూరారంకు చెందిన మరొక వ్యక్తి సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు.

వెనక ఉన్న ఆటోలోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని నర్సాపూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.

ఘటన స్థలంలో మృతుల బంధువుల రోదనలు అక్కడి వాతావరణాన్ని దయనీయంగా మార్చాయి. ఆందోళనకరమైన ఈ సంఘటన రోడ్డు భద్రతపై మరోసారి ఆలోచనను రేకెత్తిస్తోంది. పోలీసులు వాహనదారులను రోడ్డు నియమాలు పాటించాలని సూచించారు.

Exit mobile version