నాగారం మున్సిపాలిటీలో లంచం కలకలం: ఏసీబీ వలలో ముగ్గురు అధికారులు

*నాగారం మున్సిపాలిటీలో లంచం కలకలం: ఏసీబీ వలలో ముగ్గురు అధికారులు*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 21

IMG 20250421 WA3065

మున్సిపాలిటీలో కాంట్రాక్టు బిల్లుల ఆమోదం కోసం అధికారులు భారీగా లంచం డిమాండ్ చేయడంతో కలకలం రేగింది. ఓ కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు రంగారెడ్డి డివిజన్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపాలిటీ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో పాటు ఇద్దరు వర్క్ ఇన్స్పెక్టర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనం కలిగించింది.

డీఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, నాగారం మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టర్ రూ. 11 లక్షల విలువైన కాంట్రాక్టు పనిని పూర్తి చేశారు. అయితే, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘు మరియు వర్క్ ఇన్స్పెక్టర్లు సురేష్, రాకేష్‌లు బిల్లు చెల్లింపు కోసం రూ. 1 లక్షా 37 వేలు (16 శాతం) లంచం డిమాండ్ చేశారు. జీఎస్టీ పోను రూ. 8 లక్షల 50 వేలు చెల్లించాల్సి ఉండగా, అంత పెద్ద మొత్తంలో లంచం ఇవ్వలేనని కాంట్రాక్టర్ మొరపెట్టుకున్నా అధికారులు కనికరించలేదు. చివరకు రూ. 1 లక్షా 30 వేలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు.

లంచం మొత్తంలో భాగంగా సోమవారం రూ. 1 లక్షను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘుకు ఇవ్వడానికి కాంట్రాక్టర్ రాగా, ఆయన ఆ డబ్బును వర్క్ ఇన్స్పెక్టర్లు సురేష్ మరియు రాకేష్‌లకు ఇవ్వమని సూచించారు. కాంట్రాక్టర్ నుంచి రూ. 1 లక్ష తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సురేష్ మరియు రాకేష్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, ఎవరికైనా ఇలాంటి అవినీతి సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేసి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అందిన సమాచారంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటన నాగారం మున్సిపాలిటీలో తీవ్ర కలకలం రేపింది.

Join WhatsApp

Join Now