జగదేవపూర్ : జగదేవపూర్ మండలంలో 50 ఏళ్లకు పైగా వయసున్న చెట్లను రాత్రికిరాత్రే కొట్టేసి కొందరు అక్రమంగా కలపను తరలిస్తున్నారు. నిత్యం అత్యధిక యంత్రాలు చెట్లు కొట్టేసే పనిలో నిమగ్నమయ్యాయి. పదుల సంఖ్యలో కూలీలు కలపను వాహనాల్లో ఎక్కిస్తున్నారు. మండల కేంద్రంమైన జగదేవపూర్‌లోని 32 ఎకరాల వక్ఫ్ బోర్డు భూమిలో ఈ తతంగం నెల రోజుల నుంచి జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. కొంతమంది స్వార్థపరులు కలప వ్యాపారమే వృత్తిగా ఎంచుకొని ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు భూముల్లో నరికివేత చేస్తున్నా అడిగే అధికార యంత్రాంగం మిన్నకుంటోంది. కూలీలు నిత్యం ఆటోల్లో వచ్చి పగలు యంత్రాలతో చెట్లను నేలకూల్చి ముక్కలు చేస్తున్నారు. రాత్రివేళల్లో వాహనాల్లో ఎక్కించి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోకపోవడంతో ప్రజలు అధికార యంత్రాంగం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
*అనుమతి ఇవ్వలేదు: – బాలేశం, అటవీ సెక్షన్ అధికారి*
చెట్టు ఏదైనా వాల్టా నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోవాల్సిందే. జగదేవపూర్‌లో చెట్ల నరికివేత కోసం అనుమతి కోరుతూ ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. వెంటనే విచారించి తగు చర్యలు తీసుకుంటాం.