*ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు*
*కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి*
*సిరన్ పల్లిలో లబ్ధిదారులతో భేటీ*
*ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల సందర్శన*
నిజామాబాద్, (ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 11 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నవీపేట మండలం సిరన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ గురువారం పరిశీలించారు. లబ్దిదారులను కలిసి, ఇంటి నిర్మాణాలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. గ్రామంలో 93 మందికి ఇళ్లు మంజూరు కాగా, 69 గ్రౌండింగ్ అయ్యాయని, 12 ఇండ్లు స్లాబ్ దశలో ఉన్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మిగతా 24 మంది కూడా ఇళ్లను నిర్మించుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ఇంటి నిర్మాణ దశలను అనుసరిస్తూ లబ్దిదారులకు వెంటదివెంట బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే, అధికారుల దృష్టికి తేవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లుల చెల్లింపులలో జాప్యం జరుగకూడదని అన్నారు. లబ్దిదారులకు సెర్ప్ ద్వారా రుణాలు మంజూరు అయ్యేలా చొరవ చూపాలని హితవు పలికారు. ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేవలం రవాణా, కూలీల వేతనాలను మాత్రమే లబ్ధిదారులు చెల్లిస్తే, ఇసుక ఉచితంగా సమకూర్చడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
అనంతరం కలెక్టర్ నవీపేట ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. కొత్తగా మంజూరీలు పొందిన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా తోడ్పాటు అందించాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలపై కలెక్టర్ సమీక్ష జరిపారు. సాదా బైనామా అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలని, క్షేత్ర స్థాయి విచారణ నిర్వహిస్తూ, త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్ వెంకటరమణ ను ఆదేశించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, ఎంపీడీఓ నాగనాథ్, సిరన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి సాయిలు తదితరులు ఉన్నారు.