గ్రామం అభివృద్ధి చెందాలని..
గ్రా మాలు, నగరాల్లో ఉండే ప్రజలకు ప్రభుత్వ పథకాలు, హక్కులు, వంటి విషయాలపై కాస్త అవగాహన ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో అది మృగ్యం. ఎంతలా అంటే ఏ ప్రభుత్వ పథకమూ వారి దరి చేరదు. ఏదేని ప్రభుత్వ సాయం కోసం అభ్యర్థిస్తే అందినంత కాడ దోచుకునే దళారులు ఎక్కువగా ఉంటారు. ఇంత అమాయక గిరిజనులకు న్యాయం చేయాలని ఎన్నో సంస్థలు, ఎంతోమంది వ్యక్తులు చేతులు కలుపుతారు. అలా మహారాష్ట్ర ధడ్‌గావ్‌లో ఓ యువ బృందం నడుం బిగించింది. ఆదివాసీల్లో చైతన్యం తీసుకువచ్చి తద్వారా సమాజాన్ని చైతన్యపథంలో ముందుకు నడపాలని వారంతా చేయి చేయి కలిపారు. సాంకేతికతను వారధిగా చేసుకున్నారు. బాల కార్మికవ్యవస్థ, పరిశుభ్రత, లంచం వంటి వివిధ అంశాలపై వరుసగా డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్, వీడియోలు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు.
‘ఆదివాసీ జనజాగృతి’ పేరుతో 50 మంది సభ్యులతో 2016 నుండి నితేష్ భరద్వాజ్ (33), నందౌర్బార్ గ్రామంలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. నితేష్ మొదట ఓ ఫెలోషిప్ ప్రోగ్రాం కింద గ్రామస్తులను అనుసంధానిస్తూ వీడియోలు తీయడం ప్రారంభించారు. ఆ వీడియోలపై ఆసక్తితో హైస్కూల్ స్టూడెంట్స్ అతని చుట్టూ తిరిగేవారు. వాళ్లని ప్రోత్సహించే నెపంతో నితేష్ గ్రామంలోని సమస్యలపై మొదటిసారి ఒక వీడియో చేశారు. దాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. అది బాగా వైరల్ అయ్యింది. దాని తరువాత బాలకార్మిక వ్యవస్థపై ఓ వీడియో చేశారు. అది అప్‌లోడ్ చేసిన తరువాత గ్రామంలో నితేష్ ప్రయత్నానికి ఊహించని ఫలితం వచ్చింది. ‘టీ తాగుదామని టీస్టాల్‌కి వెళితే అక్కడ పనిచేసే పిల్లలను షాపు యజమాని దాచేసేవాడ’ని నితేష్ గుర్తు చేసుకున్నారు. అప్పటి నుండే నితేష్ గ్రామంలోని సమస్యలపై దృష్టిపెట్టాలనుకున్నారు.
నితేష్ ప్రయత్నాలకు వస్తున్న గొప్ప స్పందనను చూసి రాకేష్ పవారా, అర్జున్ పవారా కూడా అతనితో చేయి కలిపారు. ఇక్కడి నుండి వాళ్ల ప్రయత్నాలు మరింత ముందుకు వెళ్లాయి. మొదటగా ఏళ్లకు ఏళ్లుగా గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఆరాతీశారు. వాటిపై స్పందించేవారిని ఒక బృందంగా తయారుచేశారు. సమస్యను సేకరించడం, వివరించడం, అవగాహన కలిగేలా వీడియోలు చేయడంపై కసరత్తు చేశారు. ‘నితేష్‌తో పనిచేయడం మొదలుపెట్టిన తరువాతే మా గ్రామంలో, మా చుట్టూ ఎన్ని సమస్యలున్నాయో అర్థమైంది’ అని చెబుతాడు రాకేష్. ‘రేషన్ కార్డు కోసం మా గ్రామంలో చాలామంది దళారులకు కొంత మొత్తం చెల్లించేవారు. అది ఉచితంగా పొందే వీలుందని మా వీడియోల ద్వారా చెప్పాం’ అంటూ తమ అనుభవాలని కూడా రాకేష్ వివరించారు.
నితేష్ ప్రయత్నాలకు ప్రభుత్వ అధికారుల నుండి ప్రశంసలు, ప్రోత్సాహాకాలు కూడా వచ్చేవి. ‘స్వచ్ఛ భారత్ మిషన్’పై అవగాహన కల్పించేందుకు నితేష్ బృందం గ్రామస్తులందరితో ఓ డాక్యుమెంటరీ చేసింది. అది కలెక్టరు దృష్టికి వెళ్లి, ఆయన కూడా అందులో భాగమయ్యారు. ఇది నితేష్ బృందానికి లభించిన గొప్ప ప్రోత్సాహం. ఆ తరువాత నితేష్ కృషి గురించి తెలుసుకున్న కలెక్టరు గ్రామంలో ఓపెన్ ఛానెల్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరుచేశారు. ప్రొజెక్టరు ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ వీడియోలు ప్లే చేసే అవకాశం కల్పించారు.
ఈ బృందంలోనే సావి పవారా (32) వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది. మహిళల సమస్యలపై మాట్లాడడం, వీడియోలు చేయడం ఆమె పని. నితేష్ బృందం చేసే వీడియోల్లో పిల్లలు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ‘ఇంట్లో ఉండే సమస్యలపై వాళ్ల గొంతుకలు కూడా ఈ వీడియోలు వినిపిస్తుంటాయి. తద్వారా పెద్దల్లో మార్పు వస్తోంది’ అంటున్నారు నితేష్. కోవిడ్ టైంలో కూడా ఈ బృందం శక్తివంచన లేకుండా కృషి చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను స్థానిక భాషలో చూపించేందుకు బృందంలో ప్రతి ఒక్కరూ కృషిచేశారు.
సమస్యలపై అవగాహన కల్పించడంతోనే నితేష్ బృందం సరిపెట్టుకోలేదు. గ్రామస్తులకు జరిగే అన్యాయాలపై ప్రశ్నించడం కూడా చేస్తోంది. ఒకసారి ఒక మహిళ దగ్గర ఉన్న 9 మేకలు విషప్రయోగం వల్ల చనిపోయాయి. అవే ఆమెకి జీవనాధారం. అయితే ఆ సమాచారం ఏ మీడియా లోనూ ప్రచారం అవ్వలేదు. దీంతో ఆమెకి రావాల్సిన ప్రభుత్వ పరిహారం అందకుండా పోయింది. ఈ విషయంపై నితేష్ బృందం ఓ వీడియో చేసింది. అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే ఆ మహిళకి పరిహారం అందింది. ఇలా ఎంతోమందికి నితేష్ బృందం ప్రభుత్వ సాయం అందేలా చేస్తోంది.
ఎన్నాళ్ల నుండో మరమ్మతు పనులు ఆగి పోయిన రహదారి నిర్మాణం కూడా వీళ్ల చొరవ వల్లే పూర్తయ్యింది. 16 ఏళ్లుగా నిలిచిపోయిన బ్రిడ్జి పనులు కూడా వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇస్తూ, అందుకు అవసరమైన రూ.45-47 కోట్లను అధికారులు మంజూరు చేశారు. బ్రిడ్జి ప్రాజెక్టు వీడియోను సమర్థవంతంగా నిర్వహించిన బృందం లోని ఓ సభ్యుడు గ్రామ సర్పంచి ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించాడు. అతనితోనే ఈ విజయ పరంపర ఆగిపోలేదు. బృందంలో పనిచేసే 14 మంది సభ్యులు వారి వారి విద్యార్హతలను బట్టి ప్రభుత్వ శాఖల్లో వివిధ పోస్టుల్లో నియమింప బడ్డారు.
నితేష్ బృందానికి యూట్యూబ్‌తో పాటు కొన్ని స్వచ్ఛంధ సంస్థలు కూడా ప్రోత్సాహకాలు ఇచ్చాయి. ‘గుర్తింపులు, బహుమతలు మాకు వద్దు. మా కృషి వల్ల మా గ్రామం గురించి అందరికీ తెలియాలి. దానికోసమే మేము పనిచేస్తున్నాం’ అంటున్న నితేష్ ఇక నుండి గ్రామంలో వేళ్లూనుకొన్న మూఢ నమ్మకాలపై కూడా దృష్టి పెట్టాలనుకుంటున్నారు. వీటిపై గ్రామస్తుల్లో అవగాహన తెచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా కార్యక్రమాలు రూపొందించాలని బృందానికి మార్గదర్శకాలు ఇస్తున్నారు. సమాజ చైతన్యంతోనే అభివృద్ధి సాధ్యమని నిరూపిస్తున్న నితేష్ బృందం కృషి ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.