సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఎస్ఎస్ఎస్ సీ “సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్” మరియు గ్లాండ్ ఫార్మా ఆధ్వర్యంలో జిల్లాలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి, అత్యవసర సమయంలో త్వరితగతిన స్పందించడానికి అధునాతన సాంకేతికత కలిగిన 10 ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైక్ లను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా ప్రజల రక్షణ, పరిశ్రమల భద్రత దృష్ట్యా పోలీసు శాఖ మరియు పరిశ్రమల సమన్వయంతో ఎస్ఎస్ఎస్ సీ “సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్” ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సొసైటీ ద్వారా పరిశ్రమలలో పని చేస్తున్న మహిళా ఉద్యోగుల భద్రత కొరకు న్యూలాండ్ పరిశ్రమ సహకారంతో గత నెలలో “షీ-షట్లర్” బస్సును ప్రారంభించడం జరిగిందన్నారు. మైగ్రేట్ లేబర్స్ పిల్లలకు, శారీరక అంగవైకల్యం ఉన్న వారికి ప్రత్యేక విధానం ద్వారా విధ్యను అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ప్రధాన పట్టణాలలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైక్ లను ప్రారంభించడం జరిగిందని, ఈ బైక్ లలో సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం జరుగుతుందని అన్నారు. అత్యవసర సమయంలో సమాచారం అందిన వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించేందుకు వీలుగా ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంటుందని అన్నారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. “సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్” మరియు గ్లాండ్ ఫార్మా ఆధ్వర్యంలో ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైక్ లను ప్రారంభించుకోవడం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టి ఈ సొసైటీ ద్వారా జిల్లా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైక్స్ పటాన్ చెర్వు, సంగారెడ్డి మరియు జహీరాబాద్ వంటి ప్రధాన పట్టణాలలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ, ట్రాఫిక్ సమస్యను నియంత్రించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్, జిల్లా ఎస్పీ, జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ మరియు గ్లాండ్ ఫార్మా మేనేజింగ్ ట్రస్ట్ రఘురమణను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలాజగ్గారెడ్డి, ఎస్ఎస్ఎస్ సీ జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, ట్రెజరర్ రమణారెడ్డి, ఎస్ఎస్ఎస్ సీ మెంబర్స్ ఆనంద్ రావ్, రమేష్, ఏ.వి. రావ్, రంజిత్ కిరణ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ సుమన్, లాలూ నాయక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.