కలివిడిగా .. సందడిగా వనభోజనాలు
చుట్టూ పరిసరాలు, వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండే కాలం ఇది. ఎక్కడ చూసినా పచ్చదనం పలకరిస్తూ ఉంటుంది. ఏరులూ, సెలయేర్లూ గలగలమని పారుతూ ఉంటాయి. ఈ తరుణంలో సమూహాలుగా, సందడి సందడిగా వనాలకు తరలివెళ్లి, అక్కడ ఉమ్మడి భోజనాలతో ఆనందంగా గడపటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. మనుషుల మధ్య మరింత స్నేహసంబంధాలూ, ఆప్యాయతానుబంధాలూ వర్థిల్లటానికి వనభోజనాలు దోహదపడతాయి. బిజీ బిజీ జీవితాల ఉరుకులు పరుగులకు భిన్నంగా ఆటపాటలతో, ఆనంద సందోహాలతో గడపటానికి పిక్నిక్కులు కేరాఫ్ అడ్రసులుగా అలరారుతున్నాయి.
ఏటేటా స్నేహపూరిత వాతావరణాన్ని చేరువచేసే మహత్తర ఘట్టమే వనభోజనం. ఇక్కడ అప్యాయమైన పలకరింపులు…కలగొలుపు కేరింతలు… ఆనందాల హరివిల్లులు సర్వసాధారణం. ఒకరిపై ఒకరికి మమకారాన్ని పంచే అద్వితీయమైన ఆ క్షణాలను వెలకట్టగలమా? వనభోజన సమయం ఆసన్నమైన ఈ వేళ ఒక్కసారి మనకూ ఆ క్షణాలను ఆస్వాదించేద్దాం రండి.
విహారం, వినోదం, ఆనందం, ఆహారం, ఆరోగ్యం, సామరస్యం, సమైక్యత, పరస్పర సహకార భావనలకు కేంద్రం వనభోజనం. ఇవన్నీ ఒకేచోట సమకూరే ఏకైక వేడుక వనభోజన కేంద్రంలోనే. కార్తీక మాసం అంటే పిక్నిక్‌ల సీజన్. ఈ కాలంలో చాలామంది వనభోజనాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
ప్రకృతితో మన బాంధవ్యాన్ని పెంపొందించేదే వనభోజనం. సెలవురోజుల్లో ఈ పిక్నిక్‌ల హడావుడి మరింతగా ఎక్కువగా ఉంటోంది. ఉదయం ఇంటి నుంచి బయలు దేరే దగ్గర నుంచి ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చే వరకూ అందరూ సమన్వయంతో పనిచేయటం. పనుల్లో భాగస్వామ్యం కావటం, ఆత్మీయ పలకరింపులు, పరస్పర సహకారం ఆద్యంతం ఇక్కడ సాక్షాత్కరిస్తుంటుంది. అంతకుముందు ఒకే అపార్టుమెంటులోనో, ఒకే వీధి, ఒకే కాలనీల్లో, ఊర్లు, పట్టణాల్లో ఉండేవారు పిక్నిక్‌లో సరదాగా కలిసి హాయిగా మంచీ చెడు గురించి మాట్లాడుకుంటుంటారు. అప్పటివరకూ నెలలతరబడి మాట్లాడుకోవటానికి వీల్లేని వారు కూడా ఈ వన సమారాధనల్లో చక్కగా ముచ్చడించుకోవటంతో సంతోషపడుతుంటారు. మరికొందరు స్నేహితులు, బంధువులు ఇలా బృందాలుగా వెళ్లి వన భోజనాలు చేస్తున్నారు. ఇంకొందరు కులాలవారీగా కూడా జరుగుతున్నాయి. ఇలా కులాలవారీగా విభజించబడితే సమాజంలో అసమానతలు, అభద్రతాభావాలు వంటివి కొనసాగుతుంటాయి. అందుకే అందరూ కులమతాలకు అతీతంగా సమైక్యతా భావంతో పిక్నిక్‌లు జరుపుకోవటం సముచితం.
పిక్నిక్‌కు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి…
పిక్నిక్‌కు వెళ్లినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యంత జాగ్రత్తగా ఉండగలిగితే ఆహ్లాదం కోసం చేసే వనవిహారయాత్రలు విషాదాంతం కాకుండా మంచి జ్ఞాపకంగా మిగులుతాయి.
సముద్రాల వద్ద : రాష్ట్రంలోని సుదీర్ఘమైన సముద్రతీరంలో ఎక్కడ చూసినా కార్తీక మాసం పిక్‌నిక్ స్పాట్‌లే కనిపిస్తుంటాయి. బీచ్‌లలో సందర్శకులు గల్లంతవుతున్న ఉదంతాలు చూస్తూనే ఉంటున్నాం. సముద్ర స్నానాలు చేసేటప్పుడు అత్యుత్సాహంగా లోతుకు వెళ్లకూడదు. పోలీసుల హెచ్చరికలు పాటించాలి.
జలపాతాలు : జలపాతాల వద్ద నాచుపట్టి జారిపోయే ప్రమాదం ఉంది. ప్రమాదకరంగా ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదు. ఆహ్లాదాన్ని ఆస్వాదించాలే కాని అత్యుత్సాహానికి దిగి ప్రమాదాల బారినపడకూడదు.
నదులు : నదులు, చెరువులు, కాలువల్లో స్నానాలకు దిగకూడదు. స్నానఘట్టాలు ఉన్నచోట్ల కూడా మెట్లు దెబ్బతిని ముందుకు పడిపోయే ప్రమాదం ఉంటుంది. హెచ్చరిక బోర్డులను గమనించి నీటిలో దిగటం ఉత్తమం. ప్రతిచోటా ఉన్న హెచ్చరిక బోర్డుల సందేశాన్ని కచ్చితంగా పాటించాలి. సరదా పేరిట సాహసాలకు దిగరాదు.
ఆకతాయితనం వద్దు : వన సమారాధనకు చెట్లు, పుట్టలు ఎక్కువగా ఉన్న చోట్లకు వెళ్లేందుకు ప్రాధాన్యత ఇస్తారు. చెట్లు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా తేనెపట్టులు ఉంటాయి. వాటిపై పిల్లలు, ఆకతాయితనం ఉన్న వారు రాళ్లు వేస్తే తేనెటీగలు దాడిచేస్తుంటాయి. విషసర్పాల ప్రమాదం కూడా పొంచివుంటుంది. వాటికి ఆవాసంగా ఉన్న పొదలు, పుట్టలు ఉన్న చోట్లకు దూరంగా ఉండటం మంచిది.
ఇంకా…
వన భోజన సమయంలో పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. వారు దూరంగా వెళ్లకుండా చూసుకోవాలి
వెళ్లే వాహనాలు కండిషన్‌లో ఉన్నాయో లేదో ముందు చూసుకోవాలి
సరిపడా మంచినీరు, ఆహార పదార్థాలను తీసుకెళ్లాలి. పిల్లలకు, వృద్దులకు ఆహారం ఆలస్యం కాకుండా అందించాలి.
వెళ్లిన ప్రదేశానికే పరిమితమైతేనే మంచిది
ఏ తిండి పదార్థాలు, ఇతరత్రా తగినన్ని లేకపోతే అప్పటికప్పుడు అమర్చుకోగలిగేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందే చేసుకోవాలి.
అన్ని వయసుల వారికి ఆటపాటలు ఏర్పాటు చేయాలి. ఎవరిలో ఏ టాలెంటు ఉందో అప్ప్పుుడే బయటపడుతుంది.
విజేతలు అయినవారికే కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో ఈ జాగ్రత్త తీసుకోవాలి. నిర్వాహకులు ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తూ మాట్లాడాలి.
సందర్శకులకు పర్యాటక సేవలు – పి.కృష్ణచైతన్య,ఎపి టూరిజం కార్పొరేషన్ విజయవాడ డివిజనల్ మేనేజర్
ఎపి టూరిజం శాఖ ద్వారా విజయవాడ డివిజన్ పరిధిలోని కృష్ణా, ఎన్‌టిఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలోని పర్యాటక ప్రాంతాల్లో కార్తీక మాసంలో పిక్నిక్‌లు జరుగుతున్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఇటీవల వచ్చిన అకాల వరదలకు విజయవాడ కృష్ణానదిలోని భవానీఐలాండ్ ముంపునకు గురై కొంతమేరకు కోతకు గురైంది. ఇప్పటికే కొంతభాగాన్ని పునరుద్ధరించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రప్రభుత్వ సహకారంతో ఇంకా పెద్దఎత్తున అక్కడి పనులు చేయాల్సివుంది. ఆ దిశగా కృషిచేస్తున్నాం. కృష్ణానదిలోనూ, నాగార్జున సాగర్‌లోనూ బోట్ షికారు వంటివి కొనసాగుతున్నాయి. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకూ బోటు షికారు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. నాగాయలంక, పులిగడ్డ ప్రాంతాల్లో రిసార్ట్స్ వంటివి ఏర్పాటుచేయటానికి ప్రతిపాదనలు ఉన్నాయి. గన్నవరం మండలం తోటపల్లి పరిధిలోని శ్రీబ్రహ్మయ్యలింగం చెరువులో రిజర్వాయర్ ఏర్పాటుకు కృషి జరుగుతోంది. రాజధాని విజయవాడ నుంచి అమరావతి, ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు టూరిజం బస్సులు ఏర్పాటుకు కృషి జరుగుతోంది. సూర్యలంక, మచిలీపట్నం బీచ్‌లలో యాత్రికులు మరింతగా పెరిగేందుకు వీలుగా ప్రాజెక్టులు చేపడతాం. రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటకశాఖామంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి, పర్యాటక శాఖ స్పెషల్ సిఎస్ వినరుచంద్, చైర్మన్ నూకసాల బాలాజీయాదవ్‌ల ఆదేశాలతో పర్యాటక కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం.