Site icon PRASHNA AYUDHAM

జిల్లాకు చేరుకున్న సీఎం కప్ క్రీడల టార్చ్ రిలే..

జిల్లాకు చేరుకున్న సీఎం కప్ క్రీడల టార్చ్ రిలే..

స్వాగతం పలికి ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

 క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్-2024 క్రీడా పోటీల టార్చ్ రిలే శనివారం సాయంత్రం నిజామాబాద్ కు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద శాసన మండలి సభ్యులు బి.మహేష్ కుమార్ గౌడ్ టార్చ్ రిలేకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. క్రీడాకారులు, ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు సిబ్బంది, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. టార్చ్ రిలేను చేతబూని, ఫులాంగ్ చౌరస్తా నుండి ప్రధాన వీధుల గుండా పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు ర్యాలీ జరిపారు. ప్రతీ క్రీడాకారుడు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ముత్తెన్న ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి వరకు క్రీడలను విస్తరింపజేసి క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సి.ఎం. కప్ పోటీలను ను గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో వివిధ విభాగాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో సత్తా చాటేలా వారిని తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే సీఎం కప్ పోటీల గురించి క్రీడాకారులకు తెలిసేలా విస్తృత ప్రచారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, ముఖ్య పట్టణాలు, నగరాల మీదుగా టార్చ్ రిలే నిర్వహిస్తోందని అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా క్రీడాకారులు సీ.ఎం కప్ పోటీలలో ప్రతిభను చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, టార్చ్ రిలే కార్యక్రమ రాష్ట్ర సమన్వయకర్త కె.మధు, సంబంధిత శాఖల అధికారులు, క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Exit mobile version